అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ గా పాపులరైన వారిలో ఒకరు పార్టీలో ఒంటరైపోతున్నారా ? పార్టీలో ఇపుడిదే టాక్ నడుస్తోంది. జేసీ బ్రదర్స్ లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా చేస్తే, జేసీ ప్రభాకరరెడ్డి ఎంఎల్ఏగా పనిచేశారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు. దివాకర్ రెడ్డితో పోలిస్తే ప్రభాకరరెడ్డి వైఖరి చాలామంది నేతలకు ఏమాత్రం పడటంలేదు. వివిధ కారణాల వల్ల దివాకర్ కామ్ గా ఉంటే ప్రభాకర్ మాత్రం అందరిపైనా రెచ్చిపోతున్నారు.





నిజానికి వీళ్ళద్దరిలో ఒకళ్ళు లేకపోతే మరొకళ్ళు లేరన్నది వాస్తవం. ఏమి చేసినా వీళ్ళద్దరు మాట్లాడుకున్న తర్వాత మొదలుపెడతారు. ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే ప్రభాకర్ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలను కెలికేస్తున్నారు. కదిరి, పుట్టపర్తి, గుత్తి, అనంతపురం, కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లోని సీనియర్లకు ప్యారలల్ గా తమ మద్దతుదారులతో రాజకీయం చేస్తున్నారు. తొందరలోనే జిల్లా అంతా బస్సుయాత్ర చేయటానికి ప్రభాకర్ రెడీ అయ్యారు. ఎంతమంది వ్యతిరేకిస్తున్న వినటంలేదు.





ప్రభాకర్ ఒంటెత్తు పోకడలను మిగిలిన నేతలు అస్సలు సహించలేకపోతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో చెప్పినా ఉపయోగం లేకపోయింది. దాంతో ప్రభాకర్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్ధంకావటంలేదు. తమ నియోజకవర్గాల్లో తిరగద్దంటే పార్టీ బలోపేతానికే తాను బస్సుయాత్ర పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తన మద్దతుదారులతో మాత్రమే పర్యటించేలా ప్లాన్  చేస్తున్నారు. దీంతో అందరు కలిసి ప్రభాకర్ ను దూరం పెట్టేయాలని డిసైడ్ చేశారట.




ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభాకర్ వైఖరి వల్ల సొంతపార్టీలోనే పెద్ద గొడవలైపోతున్నాయి. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లోని నేతలను ఫుల్లుగా కెలికేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ పై పుట్టపర్తి మాజీ ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి బహిరంగంగానే తిరగబడ్డారు. తొందరలోనే ఇదే పద్దతిని మిగిలిన నేతలు కూడా అనుసరించేందుకు రెడీ అవుతున్నారు. ఇదే గనుక జరిగితే పార్టీలో బహిరంగంగానే గొడవలు తప్పేట్లులేదు. వీళ్ళల్లో ఎవరినీ కంట్రోల్ చేయలేక చంద్రబాబు చోద్యం చూస్తున్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: