అమర్నాథ్ యాత్ర అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాలి. అయినా కూడా ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆ ప్రకృతి లింగాకారాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా అమర్నాథ్ యాత్ర చేపడతారు. ఈ ఏడాది ఉగ్రదాడులు ఉంటాయని ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. అయితే ఉగ్రదాడులు లేవు కానీ ఈసారీ ప్రకృతి కన్నెర్ర చేసింది. ఒక్కసారిగా అమర్నాథ్ పరిసరాల్లో వరదలు చుట్టుముట్టాయి. అమర్నాథ్ గుహ వద్దకు కూడా నీరు చేరింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 14మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇక గల్లంతైనవారి సంఖ్యపై సరైన సమాచారం లేదు.

వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టాయి. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా భారీగా వర్షపు నీరు పొంగి పొర్లడంతో.. యాత్రికులు వేసిన టెంట్లు కూడా కొట్టుకుపోయాయి. బోలేనాథ్ గుహ వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ 12 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. ఓవైపు వరద, మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వారికి ఏంచేయాలో తెలియని పరిస్థితి. అటు కనీసం తలదాచుకోడానికి టెంట్లు కూడా లేకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జూన్ 30న మొదలైన అమర్నాథ్ యాత్ర.. ఆగస్ట్ 11 వరకు జరగాల్సి ఉంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా అమర్నాథ్ యాత్రను నిర్వహించలేదు. యాత్రకు భక్తులు రావొద్దని సూచించారు అధికారులు. ఈ ఏడాది కొవిడ్ కల్లోలం తగ్గడంతో యాత్రికులకు అనుమతి ఇచ్చారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత యాత్ర మొదలు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్నాథ్ కు చేరుకున్నారు. అయితే రెండురోజులుగా అమర్నాథ్ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. కానీ వరదను మాత్రం ఎవరూ అంచనా వేయలేదు. కొండ కోనల్లో పడిన వర్షాలకు వరదలు వచ్చాయి. మెరుపు వరదలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వర్షాల కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: