రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి, పార్టీకి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందనేమాట వాస్తవం. ఆమధ్య విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా బరిలో దింపి ప్రచారం కోసం కష్టపడ్డారు నాని. ఆ తర్వాత ఆయన పెద్దగా పార్టీ విషయాల్లో కలుగజేసుకోలేదు. టీడీపీ మహానాడుకి కూడా ఆయన హాజరు కాకపోవడం, ఆయన అనుచరులెవరూ రాకపోవడం పార్టీలో చర్చకు దారి తీసింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో కలకలం రేపాయి. నాని బయటకు వెళ్తారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, పార్టీలోనే ఉంటూ చంద్రబాబుకి ఆయన చురకలంటిస్తున్నారని అర్థమవుతోంది. వైసీపీకి రఘురామ ఎలాగో, టీడీపీకి కేశినేని నాని అలా తయారయ్యారనే కామెంట్లు వినపడుతున్నాయి.

బుధవారం రోజు మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కేశినేని నాని కొన్ని కామెంట్లు చేశారు. టీడీపీలో ఏక్ నాథ్ షిండే ఉన్నారని, ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలకు బీజేపీ కూడా కౌంటర్ ఇవ్వలేకపోయింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జస్ట్ నో కామెంట్, ఇప్పుడేం చెప్పేలేం అన్నారంతే. ఆ తర్వాత కూడా కేశినేని నాని మరోసారి బాంబు పేల్చారు. గురువారం రాత్రి టీడీపీ అధిష్టానాన్ని, నాయకులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు నేరుగా చంద్రబాబుని ఉద్దేశించి చేసినవే అంటున్నారు. కానీ ఆయనకు పార్టీని వదిలి వెళ్లే ఉద్దేశం ఉందో లేదో మాత్రం బయటపెట్టలేదు.

తనను కొన్ని రోజులు బీజేపీలోకి, మరికొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. తాను చెప్పింది అర్థం చేసుకోవాలని అన్నారు కేశినేని నాని. ముందు పార్టీని పటిష్టపరచుకొని.. ఎలా అధికారంలోకి తీసుకురావాలనే విషయాన్ని ఆలోచించాలని సూచించారు. పార్టీ నాయకత్వానికి ఆయన చురకలంటించారు. ఆయన కామెంట్లు చూస్తుంటే, పార్టీపై ఆయనకు ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్థమవుతోంది. అదే సమయంలో పార్టీ అధినేతపై కూడా నాని అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారని, విజయవాడలో తనకి ప్రత్యామ్నాయంగా తన తమ్ముడిని తెరపైకి తెస్తున్నారని బాధ కూడా నానిలో ఉంది. అందుకే ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: