చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి కరివేపాకులాగ అయిపోయింది. ఈనెల 11, 12 తేదీల్లో వైజాగ్ లో నరేంద్రమోడీ పర్యటించబోతున్న విషయం తెలిసిందే. మోడీ పర్యటన సందర్భంగా మిత్రపక్షం హోదాలో తానుకూడా పాల్గొనాలని పవన్ అనుకున్నారట. అయితే బీజేపీ నేతల తాజా మాటలను బట్టి పవన్ కు ఎంట్రీలేదనే అనిపిస్తోంది. ఇదే విషయమై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో  మాట్లాడుతు మోడీ పర్యటన పూర్తిగా అధికారికమన్నారు.





ప్రధానమంత్రి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయమే చూసుకుంటుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే మోడీ కార్యక్రమంలో పవన్ కు ఎంట్రీ సాధ్యంకాదని జీవీఎల్ చెప్పేసినట్లే. మొదటినుండి కూడా మోడీ ప్రోగ్రామ్ లో పవన్ కు ఎంట్రీ ఉండదని అనుకుంటున్నదే. ఎందుకంటే రెండురోజుల పర్యటనలో మోడీ అనేక శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇవన్నీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతోనే నిర్ణయమైయ్యాయి.





రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో రాజకీయపార్టీలకు అవకాశం ఉండదు. ఒకవేళ ముఖ్యమంత్రి లేదా స్వయంగా ప్రధానమంత్రే అనుకుంటే ప్రతిపక్షాల నేతలను కలవకూడదని కూడా ఏమీలేదు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రతిపక్షాల నేతలను ఎవరిని కూడా జగన్ దగ్గరకు రానీయరన్నది తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబునాయుడు కూడా అప్పట్లో ఇలాగే వ్యవహరించారు. చంద్రబాబుకే దిక్కులేకపోతే ఇక పవన్ను ఎవరు పట్టించుకుంటారు ?





మిత్రపక్షం అధినేత హోదాలో ప్రధాని కార్యక్రమంలో పవన్ హాజరయ్యేట్లు చూడటం బీజేపీకి చిటికెలోపని. కానీ కమలనాదులు కూడా పవన్ను దూరంగానే ఉంచాలని అనుకున్నట్లున్నారు. ఎందుకంటే తమతో మిత్రపక్షంగా ఉంటూనే సమస్యలపై పోరాటంలో చంద్రబాబుతో పవన్ చేతులు కలపటాన్ని బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏరోజైనా పవన్ తమతో కటీఫ్ చెప్పే అవకాశాలున్నట్లు బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ను ప్రధానితో కలపాల్సిన అవసరంలేదని డిసైడ్ అయ్యారట. అంటే బీజేపీలో  పవన్ పరిస్ధితి కరివేపాకులాగ తయారైపోయిందనేది అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: