బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరటం ఖాయమైపోయిందా ? అవుననే చెబుతున్నారు కన్నా సన్నిహితులు. ఇపుడీ విషయంపై కాపు ప్రముఖుల మధ్య కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 26వ తేదీ లేదా ఫిబ్రవరిలో  జనసేనలో చేరటానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. వివిధ కారణాల వల్ల కన్నా బీజేపీలో ఇమడలేకపోతున్నారు. అందుకనే పార్టీలో బాగా సఫొకేషన్ ఫీలవుతున్నారు.

బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో కన్నాకు ఏమాత్రం పడటంలేదు. దాంతో ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగ తయారయ్యాయి. కన్నాను ఏమీచేయలేక ఆయన వర్గంగా ముద్రపడిన ఏడుమందిని జిల్లాల అధ్యక్ష పదవుల నుండి వీర్రాజు ఈమధ్యనే తొలగించారు. దాంతో  ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులాగున్నా గొడవలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు, భీమవరంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా హాజరుకాలేదు.

టార్గెట్ చేసి వీర్రాజు వెంటపడుతున్న కారణంగా ఇక పార్టీలో ఉండి ఉపయోగంలేదని కన్నా నిర్ణయానికి వచ్చేశారట. అందుకనే జనసేనలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు. దీనికి నిదర్శనం ఏమిటంటే మాచర్ల, పెదకాకాని నియోజకవర్గాల్లో కన్నా మద్దతుదారులైన నేతలు, కార్యకర్తలు సుమారు 500 మంది బీజేపీకి రాజీనామాలు చేసేశారు. రాజీనామా చేసిన నేతలు మీడియాలో బాహాటంగానే వీర్రాజుపై ధ్వజమెత్తటం గమనార్హం.

పార్టీలో వీర్రాజు కారణంగా కన్నాకు ఎదురవుతున్న సమస్యలను మద్దతుదారులు డైరెక్టుగా మీడియాతో చెప్పేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కన్నా మద్దతుదారులను వీర్రాజు పార్టీలోకి రానిచ్చే అవకాశం తక్కువే. తనకోసం పార్టీకి రాజీనామా చేసిన మద్దతుదారులను కన్నా గాలికొదిలేసి బీజేపీలో కంటిన్యు అయ్యే అవకాశాలూ తక్కువే. ఈ నేపధ్యంలోనే 26వ తేదీన  తన మద్దతుదారులతో జనసేనలో చేరాలని కన్నా డిసైడ్ చేసుకున్నారట. బీజేపీ నేతలకు గాలమేస్తే చూస్తే ఊరుకునేది లేదని ఎంపీ జీవిఎల్ నరసింహారావు వార్నింగ్ ఇచ్చిన కారణం ఇదేనంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: