నల్గొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు ఈ హత్య రాజకీయ హత్య అని కావాలనే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆ హత్య కేసు డీల్ చేస్తున్న నల్లగొండ టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోయారు. సిఐ తన వద్ద ఉన్న డిపార్ట్ మెంటల్ సిమ్ కార్డును మాడ్గులపల్లి పోలీసు స్టేషన్ లో అప్పగించి వెళ్లిపోయాడు. అలాగే తన వద్ద ఉన్న వెపన్ ను కానిస్టేబుల్ ద్వారా సరెండర్ చేశారు.
అంతేకాకుండా తన పర్సనల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడు. అయితే నల్గొండ మున్సిఫల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు విషయమై కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మద్య విమర్శలు, ప్రత్యారోపణలకు మద్య తెరతీసింది. కాగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయంతోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎమ్మెల్కే వీరేశం ఖండించారు. ఇక సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోయవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలవరం చోటు చేసుకుంది.
ఇప్పటికే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సిబిఐ కి కానీ.. ప్రత్యేక దర్యాప్తు సంస్థకు కానీ ఇవ్వాలంటూ ఆయన సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు నల్లగొండ ఎస్పీ మాత్రం ఈ హత్య చిల్లర పంచాయితి కారణంగా జరిగింది తప్ప రాజకీయ కుట్ర కోణం లేదని వెల్లడించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి హైకోర్లు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కేసు తాలూకు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు నల్లగొండ ఎస్పీని ఆదేశించిన పరిస్థితి ఉంది.
మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా విచారణాధికారిగా ఉన్న సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ హత్యపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇక బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన నాటినుంచి ఈ హత్య కేసు విషయమై ఇటు అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల యుద్ధం చేస్తోంది. మొత్తానికి ఈ కేసు కోర్టుకు చేరి.. కోర్టు జోక్యం చేసుకున్న తరుణంలో ఉన్నఫలంగా సిఐ మాయమైపోవడం పెద్ద దుమారమే రేపుతోంది.
