ఆంధ్రప్రదేశ్  నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులకు వేదికపై నుంచే కేసీఆర్ చేతులూపుతూ అభివాదం చేశారు. 


కేవలం అతిథి పాత్రలో గిరిగీసుకోకుండా ఏపీ సీఎస్ కు ప్రమాణ స్వీకారం సమయంలో సలహాలిస్తూ కలివిడిగా కనిపించారు. వైఎస్ జగన్, విజయమ్మలతో తరచూ మాట్లాడుతూ కనిపించారు. ఒక సమయంలో స్టాలిన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వమని కేసీఆర్ జగన్ కు సూచించారు. జగన్ కూడా కేసీఆర్ సూచనలు పాటించారు. 

ఇక వేదికపై క్లుప్తంగా మాట్లాడినా... కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. మీ అందరి ప్రేమ, అనురాగం, ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ, యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన హృదయపూర్వమైన అభినందనలు, ఆశీస్సులు తెలుపుతున్నానన్నారు. 

తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టమన్నారు. ముఖ్యమంత్రిగారి వయస్సు చిన్నది. కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నెరవేర్చే అభినివేశం, శక్తి, సామర్ధ్యం, ధైర్యం సీఎం జగన్‌కు ఉందని గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రస్ఫూటంగా నిరూపించారన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మీ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. మీరు సంపూర్ణ విజయం సాధించాలని భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

జగన్‌మోహన్‌రెడ్డి గారి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం.. కృష్ణా నదిలో మనకు సమస్యలు ఉన్నాయి. అక్కడ లభించే నీటి బొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయ రాష్ర్టాల వాళ్లం కలిసి వినియోగించుకుంటూనే సంవృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలి అంటూ ప్రసంగిచారు. మొత్తానికి కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: