పక్క రాష్ట్రంలో బతుకుమ్మ చీరల పేరుతో చేనేత రంగానికి  ప్రభుత్వం ఊతం ఇస్తుంటే.. ఏపీలో మాత్రం ప్రతికూల పరిస్థితులతో   చేనేత రంగం కుదేలైంది. వరుసగా మూడు నెలలుగా శుభ కార్యాలకు బ్రేక్ పడటంతో అమ్మకాలు లేక కార్మికులు, కూలీల పరిస్థితి ఇబ్బందిగా మారింది. వెంకటగిరిలోనే వందకోట్ల మేర అమ్మకాలు లేక నష్టాల పాలయ్యింది చేనేత రంగం. దీంతో కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాణ్యమైన నాజూకు అయిన చీరలు తయారవుతాయి. అతి తక్కువ బరువుతో మహిళలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పట్టుతో చేనేత కలగలసిన చీరలు ఇక్కడి ప్రత్యేకత.  ప్రభుత్వ రికార్డుల ప్రకారం వెంకటగిరిలో చేనేత మీద ఆధారపడి 10వేలమంది కార్మికులు పని చేస్తున్నారు. ఇక వ్యాపారులు కూడా వందల సంఖ్యలోనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో వెంకటగిరి చీరలకు డిమాండ్ ఉంటుంది. అయితే.. ప్రోత్సాహం లేక రోజు రోజుకు వృత్తిని వదిలి ఉపాధి కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నవారు ఎక్కువుతున్నారు. 


మూడు నెలలుగా శుభదినాలు లేకపోవడంతో చేనేత రంగం కుదేలయ్యింది. ఆషాఢ మాసంతో చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 కోట్ల మేర చేనేత వ్యాపారం నిలిచిపోయింది. చీరల నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు మగ్గం పని కూడా చాలా వరకు నిలిపేశారు. చేనేత కార్మికులు పనులు లేక తల్లడిల్లుతున్నారు.   
జిల్లాలోని వెంకటగిరితో పాటు బుచ్చిరెడ్డిపాళెం, చెన్నూరు, ఇందుకూరుపేట తదితర ప్రాంతాల్లో చేనేత వ్యాపారం సాగుతోంది. ఇక్కడి నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో సహా ఇతర రాష్ట్రాలకు చేనేత చీరలు ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం చీరల ఎగుమతి నిలిచిపోయింది. జీఎస్టీ దెబ్బకు ఈ రంగం ఇప్పటికీ కొలుకోలేదు. చాలా మంది కార్మికులు ఈ పని మానేసి ఇతర పనుల వైపు దృష్టి సారించే పరిస్థితి ఏర్పడింది. 


ప్రభుత్వం చేనేత సహకార కేంద్రం ద్వారా చీరలు కొనుగోలు చేయాలని కార్మికులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. చేనేత సహకార సంఘాలు ఉన్నా కార్మికులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. వెంకటగిరి చీరకు ధర్మవరం చీరలాగా  ఓ బ్రాండ్ ను ప్రభుత్వం తయారు చేసి మార్కెటింగ్‌కు వీలు కల్పించాలని కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: