వైసిపిలో కీలక పరిణామాలు
చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని
జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. వైసిపికి
సంబంధించిన సోషల్ మీడియాలో షర్మిలకు అభినందలంటూ హోరెత్తిపోతోంది.
వైసిపి అధ్యక్షునిగా జగన్ ఉంటే గౌరవాధ్యక్షురాలిగా తల్లి విజయమ్మ ఉన్న విషయం తెలిసిందే. పార్టీకి గౌరవాధ్యక్షురాలే అయినా విజయమ్మ ఏరోజు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అవసరమైన సందర్భంలో జగన్ ఆహ్వానించినపుడు మాత్రమే తల్లి వేదిక మీద కనబడుతున్నారు.
అదే సమయంలో పార్టీలో ఎటువంటి పోస్టు లేకపోయినా అవసరం అయినపుడల్లా షర్మిల తన వంతు సాయం అందిస్తునే ఉన్నారు. జగన్ జైలులో ఉన్నపుడు పార్టీ తరపున నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సుమారు 2500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. తర్వాత వచ్చిన ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
మొన్నటి ఎన్నికల్లో కూడా పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా చంద్రబాబు, చినబాబులను బహిరంగసభలు, రోడ్డు షోల్లో ఏ విధంగా ఆటాడుకున్నది అందరూ చూసిందే. బైబై బాబు అంటూ షర్మిల ఇచ్చిన నినాదం జనాల్లో బాగా ఎక్కేసింది.
ఎన్నికల్లో ప్రచారం చేయటమనే తన బాధ్యత తీరిపోగానే వెంటనే తెర వెనక్కు వెళ్ళిపోయారు. మంత్రివర్గంలో కానీ అంతకుముందు ఎంఎల్ఏ టిక్కెట్ల విషయంలో కానీ షర్మిల జోక్యం చేసుకున్నారన్న ఒక్క మాట కూడా ఎక్కడా వినబడలేదు. పార్టీతో షర్మిల మమేకం అయిన విషయం అందరికీ తెలుసు కాబట్టి ఒంగోలు, విశాఖపట్నం పార్లమెంటు స్ధానల్లో ఏదో ఒకదాని నుండి పోటి చేస్తారని, చేయాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఆ డిమాండ్లు డిమాండ్లుగానే మిగిలిపోయాయి లేండి.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిల పేరు ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చేసింది. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రిగా తీరికలేని పనులతో బిజీగా ఉన్న జగన్ పార్టీ కార్యక్రమాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారట. అందుకనే సోదరిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే పార్టీ పరంగా మొత్తం వ్యవహారాలు ఆమే చూసుకుంటుందని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి