గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా సంబోధించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఎట్టకేలకు లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. మహాత్మాగాంధీ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పారు. మరోవైపు తనను ఉగ్రవాదిగా సంబోధించిన రాహుల్ గాంధీ మీద చర్య తీసుకోవాలని ప్రజ్ఞా డిమాండ్ చేశారు. 

 

మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నానని లోక్‌సభలో చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, వక్రీకరించారని ఆమె వాపోయారు. దేశానికి చేసిన సేవలకు గాను మహాత్మాగాంధీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె నిప్పులు చెరిగారు. తనను ఉగ్రవాదిగా పేర్కొన్న రాహుల్ గాంధీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతుండగానే ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీకి జై, డౌన్‌ డౌన్‌ గాడ్సే అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. 

 

అంతకుముందు ప్రజ్ఞా ఠాకూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలకు ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా బాధ్యత వహించాలని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయంతో ఏకీభవించిన స్పీకర్ ఓం బిర్లా.. గాంధీ గొప్పతనం ఏంటో ప్రపంచం మొత్తానికీ తెలుసనీ చెప్పారు. ఈ విషయంపై రాజకీయం చేయడం సరికాదనీ, ఇప్పటికైనా సభ్యులు శాంతించాలని చెప్పారు. 

 


మహాత్మాగాంధీని చంపిన వ్యక్తిని దేశభక్తుడు అనడం కంటే.. ప్రస్తుత ఎంపీని ఉగ్రవాదిగా సంబోధించడం ఇంకా పెద్ద నేరమన్నారు బీజేపీ ఎంపీలు. రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్ కు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే గాడ్సేను దేశభక్తుడిగా సంబోధించి తర్వాత సారీ చెప్పిన ప్రజ్ఞా ఠాకూర్ ఎంపీ అయ్యాక కూడా తన పద్ధతి మార్చుకోలేదు. సాధ్వి వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంతో బీజేపీ సైతం క్రమశిక్షణా చర్యలకు దిగింది. రక్షణరంగానికి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్‌ నుంచి ఆమెను తొలగించింది. శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు సాధ్విని దూరంగా పెట్టింది. అటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో అడుగుపెడితే.. ప్రజ్ఞా ఠాకూర్ దిష్టిబొమ్మలు కాదు.. ఆమెనే తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: