సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్న కేరళ, నిన్న పంజాబ్ అసెంబ్లీలు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయగా.. తాజాగా మహారాష్ట్ర  కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. చట్టాన్ని అమలు చేయమని రాష్ట్రాలు మొండికేయడం.. రాజ్యాంగానికి విరుద్ధంగా మారుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.


సీఏఏ, ఎన్ఆర్పీఎస్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాలేజీ యువత, స్వచ్చందసంస్థలు, విపక్షాలు.. వీధుల్లో నిరసనలు చేస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు.. తాము ఈ చట్టాలకు వ్యతిరేకమని ప్రకటించాయి. తొలుత కేరళ, తర్వాత పంజాబ్ ప్రభుత్వాలు.. తమ అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు సైతం చేశాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసే రాష్ట్రాల జాబితాలోకి తాజాగా మహారాష్ట్ర వచ్చి చేరింది. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  సీఎం ఉద్ధవ్ కూడా సీఏఏకు వ్యతిరేకంగానే ఉన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ చేసే తీర్మానంపై  చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు శివసేన నేతలు.

 

సీఏఏను వ్యతిరేకిస్తూ 131వ ఆర్టికల్ ప్రకారం కేరళ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఆ రాష్ట్రగవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు . దీనిపై ఇప్పటికే సీఎంను బాధ్యుడిగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి, .. నివేదిక ఇవ్వాలని కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 

 

పౌరసత్వ సవరణ చట్టం  అమలును రాష్ట్రాలు నిరాకరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలుచేయాల్సిందేనని.. లేదంటే అది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని.. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చన్నారు.

 

మాజీప్రధాని నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాన్ని.. ప్రస్తుత ప్రధాని మోదీ సవరించారని కేంద్రహోంమంత్రి అమిత్ షా సమర్థించారు. అల్పసంఖ్యాకుల పౌరసత్వాన్ని కాపాడేందుకే సీఏఏ వస్తోందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: