అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. పోయిన ప్రతిష్టను తిరిగి రాబట్టుకునేందుతు టీడీపీ అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ వ్యూహంపై అప్పుడే వైసీపీ నాయకులు దాడి ప్రారంభించారు. ఇక చంద్రబాబు విషయంలో విమర్శించడంలో ఓ అడుగు ముందే ఉండే రోజా.. ఈ వ్యూహంపైనా విరుచుకుపడ్డారు.



ప్రజలు ఓడించి మూలనపడేసినా చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని కామెంట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులను ఎన్ని యాత్రలు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేసిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆర్కే రోజా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఆ ప్రాంత వాసులు తరిమికొట్టాలని రోజా పిలుపు ఇచ్చారు.



పేదల ప్రజలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వంపై బురదజల్లే విధంగా చైతన్య యాత్రలు చేయాలనుకోవడం దురదష్టకరమని రోజా కామెంట్ చేశారు. చంద్రబాబుది నీతి మాలిన రాజకీయమని ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. రైతు భరోసా కింద 55 లక్షల మందికి, అమ్మఒడి పథకం ద్వారా 42 లక్షల మంది తల్లులకు, పెన్షన్‌ ద్వారా 54 లక్షల మందికి లబ్ధిచేకూర్చారని, అదే విధంగా వాహనమిత్ర, చేనేత కార్మికులకు వైయస్‌ఆర్‌ చేయూత ఇలా అనేక కార్యక్రమాలను సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు.



ముఖ్యంగా పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చారని, నాడు – నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను అభివద్ధి చేసి అన్ని వసతులతో పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారన్నారు. బస్సుయాత్రతో ప్రజలను చైతన్యం చేస్తానని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న రోజా... సీఎం వైయస్‌ జగన్‌ చేసే ప్రతి కార్యక్రమానికి చంద్రబాబు అడ్డుపడుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: