తిరుపతిలో గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్మాణానికి బ్రేక్ పడింది. ఫ్లై ఓవర్ డిజైన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఫ్లై ఓవర్‌పై నామాల విషయంలో ఆగమశాస్త్ర సలహాదారుల అభిప్రాయం మేరకే ముందుకెళ్తామని .. ఫ్లై ఓవర్‌పై ఇప్పుడే నామాలు పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో మరోసారి వారధి నిర్మాణానికి బ్రేక్ పడినట్టయింది. 

 

రూ.684 కోట్ల బడ్జెట్‌, 6 కి.మీ పొడవు, 18 నెలల కాలపరిమితితో పూర్తి చేయాలనుకున్న గరుడ వారధికి అడుగడునా అడ్డంకులు వస్తున్నాయి. తాజాగా టీటీడీ చెబుతున్న రీడిజైన్‌ వ్యవహారంతో మరోసారి ప్రాజెక్టు ఆగిపోయింది. 
తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 6 కి.మీ మేర ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు గత ఏడాది తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, టీటీడీ సంయుక్తంగా ఒప్పందానికి వచ్చాయి. రూ.684 కోట్ల అంచనాతో ఎలివేటెడ్‌ స్మార్ట్‌ కారిడార్‌ పేరిట గరుడ వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీటీడీ 458.28 కోట్లు, స్మార్ట్‌ సిటీ తరపున 225.72 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. 

 

అయితే రివర్స్‌ టెండర్లలో భాగంగా కొద్ది రోజులు పనులు ఆగాయి. అటు తరువాత వారధికి నిధులు మంజూరులో ప్రభుత్వ అనుమతి కోరుతూ.. కొత్తగా వచ్చిన టీటీడీ పాలకమండలి తొలి సమావేశం తీర్మానం చేసింది. ఆ తర్వాత రెండో సమావేశంలో గరుడ వారధికి రీ డిజైన్‌, రీటెండర్‌కు ప్రతిపాదిస్తూ మళ్లీ ప్రభుత్వ అనుమతి కోసం పంపింది.అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. వారధి టెండరు దక్కించుకున్న ఆఫ్కాన్స్‌ సంస్థ తొలుత కొంత గందరగోళానికి గురైనా తర్వాత తనపని తాను చేసుకుపోతోంది.  

 

ఇటీవల తిరుపతిలో పర్యటించిన మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గరుడవారధిపై స్పందించారు. వారధికి ఎలాంటి ఆటంకాలు ఉండవనీ.. నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.ఇదే సమయంలో అయితే తొలుత అనుకున్న డిజైన్ లో మార్పులు చేస్తూ పిల్లర్ పై కొత్తగా శ్రీవారి నామాలను ముద్రించారు.ఇప్పటి వరకు ఫ్లై ఓవర్ కు సంబంధించిన 36 పిల్లర్లపై శ్రీవారి నామాలను అచ్చు వేశారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కొద్ది మంది వాహనాల కిందా నామాలు ఎంటని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వరుస వివాదాల కారణంగా తొలిసారిగా టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన గరుడ వారధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో టీటీడీ ఇవ్వాల్సిన 458 కోట్లు రూపాయిల వాటాతో పాటు నామాల వివాదం, రీ డైజైనింగ్ అంశంపై చర్చించారు. 

 

సమావేశం అనంతరం గరుడ వారధి ప్రాజెక్టుకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు ప్రకటించారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ప్రాజెక్టు పై గత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదన్నారు. గరుడ వారధి ఫ్లైఓవర్ డిజైన్ ఫైనల్ కాలేదన్నారు. మార్పులు ఖరారయ్యాక తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్. పిల్లర్ కు నామాలు వేసే విషయంలో ఆగమశాస్త్ర సలహా దారుల అభిప్రాయం మేరకే ముందుకు వెళతామంటున్నారు. మూడుసార్లు వారధి పనులు వాయిదా పడటంతో తిరుపతి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: