ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీనే ఇచ్చేలా కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో టీడీపీ బలంగా ఉండటం వల్ల కొంచెం దూకుడు చూపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైసీపీకి ధీటుగానే టీడీపీ నిలబడుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాలని ఆకర్షిస్తున్న విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ-వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.

 

అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఇక్కడ టీడీపీదే హవా కనిపిస్తోంది. టీడీపీకి బలమైన నేతలు ఉండటం ‘ఫ్యాన్’ స్పీడ్‌ని తగ్గించే అవకాశం ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఇక్కడ మాత్రం కాస్త టీడీపీకి  కాస్త అనుకూల ఫలితాలు వచ్చాయి. విజయవాడ ఎంపీ స్థానంతో పాటు, తూర్పు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గెలిచారు. ఇక వీరు ఇప్పుడు కార్పొరేషన్‌లో టీడీపీని గెలిపించేందుకు కష్టపడుతున్నారు.

 

పైగా కేశినేని కుమార్తె శ్వేత మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారాయి. అలాగే సెంట్రల్‌లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ, సీనియర్ నాయకుడు నాగుల్ మీరాలు టీడీపీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడపై పట్టున్న వంగవీటి రాధా కూడా కార్పొరేషన్ రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. బొండా ఉమాతో కలిసి ఆయన గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.

 

అయితే టీడీపీలో పరిస్తితి ఇలా ఉంటే వైసీపీలో గ్రూప్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌లు తమ తమ అభ్యర్ధులకే మేయర్ పీఠం దక్కేలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ మేయర్ అభ్యర్ధిని ప్రకటించిన, వైసీపీ మాత్రం ఇంకా మేయర్ ఎవరో తేల్చలేదు. దీంతో విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ అంత అనుకూల పరిస్థితులు కనపించడం లేదు. మొత్తానికైతే విజయవాడలో ఫ్యాన్ స్పీడ్ తమ్ముళ్ళు తగ్గించేలాగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: