సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ నేతలు టీడీపీ నేతలను కిడ్నాప్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ టీడీపీ నేతల కిడ్నాప్ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వైసీపీ నాయకులు కడప జిల్లా బి. మఠం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి కొమ్మినేని ఉపేంద్రనాయుడు, అతని బంధువు ముద్దుకృష్ణమనాయుడులను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. 
 
వైసీపీ నాయకులు బి.మఠం జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా కొమ్మినేని అంగీకరించకపోవడంతో ఆయనను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. బి.మఠం శివార్లలో ఈ కిడ్నాప్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ చేసినవారు వైసీపీ మద్దతుదారులే అని తాము అనుమానిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. 
 
బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ పత్రంపై సంతకం చేయించుకోవాలని వైసీపీ నాయకులు ఈ పని చేసి ఉంటారని తాము భావిస్తున్నామని తెలిపారు. స్థానికులు వీరితో పాటు దిరసవంచ ఎంపీటీసీ అభ్యర్థి ఏసురత్నం, టీడీపీ తరపున నామినేషన్ వేసిన దుగ్గిరెడ్డి కిడ్నాప్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 
కొమ్మినేని ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపుతోంది. వైసీపీ నాయకులు మాత్రం ప్రజల మద్దతుతో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలకు దిగుతోందని చెబుతున్నారు. టీడీపీ నేతలే దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లకు పాల్పడుతూ తమపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ఈసీ విచారణలో అసలు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యలు చేశారు. ఈసీ ఈ ఫిర్యాదు పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: