తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొదట్లో ఒకటీ రెండూ ఉండే కేసులు కాస్తా ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలోకి వెళ్లాయి. మొత్తం 40 వరకూ పాజిటివ్ కేసులు ఉండే అవకాశం కనిపిస్తోంది.అంతే కాదు.. మరో 140 కేసుల రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ చాలా స్ట్రిక్టుగా లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించి అమలు చేస్తున్నారు.

 

 

ఇదే సమయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకూ తెలంగాణలో ట్రాన్సిట్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ట్రాన్సిట్ కేసు అంటే.. ఒకరి నుంచి మరొకరికి స్థానికంగా కరోనా వ్యాపించడం అన్నమాట. ఇలాంటి కేసులు మొదలైతే దాన్ని రెండో దశ అంటారు.. ఈ తరహా కేసు మొన్న ఒకటి నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ట్రాన్సిట్ కేసులు నమోదు కాదు. ఈ విషయాన్ని చెప్పిన కేసీఆర్... ఇదో శుభవార్త. ఈరోజు ఒక్క ట్రాన్సిట్ కేసు కూడా రాలేదు.

 

 

పరిస్థితిని మనం ఇలాగే అదుపులో ఉంచుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇప్పటికే విమానాలు బంద్ అయ్యాయి. ఎయిర్ పోర్టులు మూతబడ్డాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులు మూసేశాం.. కాబట్టి ఇక కొత్తగా వైరస్ బయటి నుంచి వచ్చే అవకాశం లేదు. కానీ.. ఇప్పటికే వచ్చిన వైరస్ ను మనం తరిమికొట్టాలి. ఇంకా వ్యాపించకుండా చూసుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కేసీఆర్ కోరారు.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సహకారం చాలా అవసరమని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని.. మూడు కి.మీ పరిధిలోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వాహనాల్లో రోడ్లపైకి వస్తే పెట్రోల్‌ బంకులు సైతం మూసివేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రాకూడదని సీఎస్‌, ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు కేసీఆర్‌ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: