ఏపీలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏడు వందలు దాటిన ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి మరింతగా విస్తరిస్తున్న సమాచారం సర్కారుకు వస్తోంది. ఈ జిల్లాలోనే కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.అందుకే జగన్ సర్కారు ఇలాంటి జిల్లాలపై స్పెషల్ గా ఫోకస్ పెడుతోంది.

 

 

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదికారులను ఆదేశించారు. ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువగా కేసులు ఉంటాయన్న అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా పరీక్షలు జరిపితే వాస్తవంగా కరోనా ఉన్నవారిని త్వరగా గుర్తించవచ్చన్నది జగన్ సర్కారు వ్యూహాంగా కనిపిస్తోంది.

 

 

అందుకే జగన్ సర్కారు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను భారీ సంఖ్యలో కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. కరోనా పరీక్షలను వేగవంతం చేస్తోంది. అయితే ఇక్కడో చిక్కు ఉంది. ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తే.. కరోనా కేసులు బయటపడే అవకాశం కూడా పెరుగుతుంది. అదే జరిగిదే దీన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకునే అవకాశం కూడా ఉంది. అయినా సరే.. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు జరిపించాలని సీఎం జగన్ అధికారులను కోరుతున్నారు.

 

 

ఇదే సమయంలో జగన్.. పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రైతులు పండించిన పంటను సరైన ధరకు కొనుగోళ్లు చేసి వారికి అండగా నిలబడాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడానని పేర్కొన్నారు. తెలుగు మత్స్యకారులును అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో చెప్పారని జగన్ చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: