దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా విజృంభణ వల్ల రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి. కరోనా కష్టకాలంలో రాజకీయపరమైన విమర్శలు చేయడం సరికాదని నేతలు ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు, విమర్శలు చేయడం తగ్గించారు. ఇలాంటి సమయంలో గత నాలుగు రోజుల నుంచి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 
 
బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా సంక్షోభం నెలకొందని.... ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారని అన్నారు. మోదీ పిలుపుతో ప్రజలకు సేవ చేస్తూ తాము ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి భూములను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 
 
రాష్ట్రంలో మే 31వ తేదీ వరకు ఎటువంటి భూ లావాదేవీలు జరపకూడదని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన మత్స్యకారులను వారివారి ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల ప్రచారాలే కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారం తిరుగుతున్నారని... బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ కర్నూలు వెళ్లి వస్తే ఆయనకు హోం క్వారంటైన్ విధించారని చెప్పారు. ఏపీలో అధికారులు రాజకీయనాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు కరోనా కేసుల గురించి పూర్తి వివరాలను తెలియజేయాలని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1016కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: