దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 28400 కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 900కు చేరువలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా గురించి శుభవార్త చెప్పింది. దేశంలో కరోనా సోకి కోలుకున్న వారికి తిరిగి కరోనా వ్యాప్తి చెందడం లేదని ప్రకటన చేసింది. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను డొనేట్ చేయాలని లవ్ అగర్వాల్ సూచించారు. ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల ఏం కాదని ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు. కేంద్రం నుంచి వెలువడిన ఈ ప్రకటన దేశ ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు. 
 
చైనా వుహాన్ లో, ఇతర దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ కరోనా సోకుతుందని వార్తలు వినిపించాయి. కరోనా సోకిన వారికి మరలా కరోనా సోకితే ఇప్పట్లో కరోనా అంతం కావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్ లో మాత్రం కరోనా సోకిన వారికి మరలా వైరస్ సోకట్లేదు. మరోవైపు రోజురోజుకు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 
 
కేంద్రం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదని ప్రకటన చేసింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడం లేదని పేర్కొన్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి. లాక్ డౌన్ అమలు వల్లే ఈ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: