ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. లాక్ డౌన్ వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. 
 
ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజల మృతికి కారణమైన కరోనా ఉద్యోగాలకు కూడా ఎసరు పెడుతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) కరోనా వల్ల ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కరోనా ఉధృతి ఇదే విధంగా కొనసాగితే అసంఘటిత రంగంలో 160 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతోంది. 
 
ప్రపంచంలోని అన్ని దేశాలలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఐఎల్‌ఓ పేర్కొంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ఆసియా, యూరప్, అమెరికా దేశాలపై కరోనా ప్రభావం ఎక్కువగా పడనుంది. 
 
లాక్ డౌన్ ముగిసి అన్ని రంగాలు కుదుటపడ్డాకే పరిస్థితులలో మార్పు వాస్తుందని ఐఎల్‌ఓ చెబుతోంది. రియల్ ఎస్టేట్, ఫుడ్ రంగాలు లాక్ డౌన్ ముగిసినా మరికొన్ని నెలల పాటు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43 కోట్ల కంపెనీలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ ముగిసినా పలు రంగాలు ఆర్థికంగా పుంజుకోవడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉందని సమాచారం. 
                 

మరింత సమాచారం తెలుసుకోండి: