ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రంలోని 3400 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల లోపు పిల్లలకు మొదట ప్రీ ప్రైమరీలో ప్రవేశాలు కల్పిస్తారు. వారికి సంవత్సరంపాటు పఠన, లేఖన నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలపై శిక్షణ ఇస్తారు. 
 
అనంతరం ఆ పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని, విద్యార్థులు చదువులో రాణించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని విద్యా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రీ ప్రైమరీ టీచర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 
 
గిరిజన, వెనుకబడిన ప్రాంతాలలో మొదట ప్రీ ప్రైమరీ అమలు చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కరోనా విజృంభణ వల్ల పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జులై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేసి షెడ్యూల్ విడుదల చేసింది. 
 
విద్యార్థులకు ఇళ్లకు దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. మరోవైపు ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ఇప్పట్లో పాఠశాలలు ప్రారంభం అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలకు పంపటానికి సిద్ధంగా లేరు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో మెజారిటీ తల్లిదండ్రులు కరోనా విజృంభణ తగ్గేవరకు పిల్లలను పాఠశాలకు పంపడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.              

మరింత సమాచారం తెలుసుకోండి: