ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి ప్రకటించారు. దేశంలో అందరి కంటే ముందే ఇంటర్ ఫలితాలు ప్రకటించామని ఏపీ సర్కారు చెప్పింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికినట్టు తెలిపింది. 

 

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వచ్చాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. 17కు పైగా వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచామని చెప్పారు.

 

దేశంలో అందరికన్నా ముందుగా ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా మంత్రి సురేష్ అభివర్ణించారు. సీఎం జగన్‌ మార్గదర్శకాల మేరకు సమష్టిగా కృషి చేసి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల అన్నీ ఆలస్యం అవుతున్నా.. అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసిందని మంత్రి చెప్పారు. 

 

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు 5 లక్షల 7 వేల మంది విద్యార్థులు రాయగా.. 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా ఉండగా.. పశ్చిమ గోదావరి, గుంటూరు ద్వితీయ స్థానంలో నిలిచాయి.

 

ఈ ఏడాది నుంచి ఇంటర్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. సెకండియర్ ఫలితాలు గ్రేడ్ ల 
విధానంలోనే ఇవ్వగా.. ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం మార్కులు ఇచ్చినట్టు తెలిపారు. మొత్తానికి ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలై ఏపీ విద్యార్థుల్లో ఉత్కంఠకు తెరదించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: