ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానా కు బాగా బొక్కపడింది. చివరకు ఉద్యోగస్తులు జీతాలు కూడా ఒక నెల సగం మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ కాస్త కుదురుకున్నారనుకోండి. ఇలాంటి సమయంలో అంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఏపీ మాత్రమే కాదు.. దేశం, ప్రపంచం అంతటా ఇదే పరిస్థితి.
అయితే ఇలాంటి సమయంలోనూ.. జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, కరోనా ప్రభావం ఉన్నా అవేమీ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపించడం లేదు. ఈసారి కూడా భారీ బడ్జెట్ నే ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి ఏకంగా 2 లక్షల 60 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందట. ఉంటే గింటే అంతకంటే ఎక్కువే తప్ప తక్కువగా ఉండదని నమ్మకంగా చెబుతున్నారు.
ఏపీ రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలు 2.60 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉండే కనిపిస్తోంది. జూన్ 16న శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి మార్చి నెలలోనే బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉంది. అంతా సిద్ధమైన తరుణంలో కరోనా కారణంగా మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.
ఆ సమయంలో వేరే దిక్కు లేక.. తొలి మూడు నెలల కాలానికి బడ్జెట్ వినియోగం కోసం ఓటాన్ అకౌంట్ రూపంలో ఆర్డినెన్సు జారీ చేశారు. జూన్‌తో ఆ ఆర్డినెన్సు కాలపరిమితి కూడా తీరిపోతోంది. జులై నుంచి తిరిగి అవసరమైన ఖర్చులకు శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో సమర్పిస్తారు. 9 నెలల కాలానికి అవసరమైన పద్దుకు ఉభయ సభల ఆమోదం పొందనున్నారు.
అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గాయి. నెలకు సగటున 6000 కోట్ల రూపాయల వరకు రావాల్సిన ఆదాయం 2 నెలలుగా సుమారు 1300 కోట్లకే పరిమితమైంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయి ఆదాయార్జనకు సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మొదట్లో అంచనాల కన్నా ఖర్చు ఎక్కువే ఉన్నా ఆ తర్వాత రోజుల్లో క్రమేణా ఆదాయమూ తగ్గిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కిందటేడాది కన్నా 20శాతం ఎక్కువే అంచనాలు ఉండే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి