అవునట.. వైసీపీ గుర్తింపే రద్దయ్యే ప్రమాదం ఉందట. ఎవరు చెప్పారంటారా.. ఇంకెవరు.. ఈ మధ్య పార్టీలోనే ఉండి అధిష్టానానికి సవాల్ మీద సవాలు విసురుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సెలవిచ్చారు. మరి రద్దు కావాలంటే ఏదో ఒక కారణం ఉండాలిగా..అది కూడా చెప్పేస్తున్నారు రాజు గారు. అసలు విజయసాయిరెడ్డి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పట.

 

 

అలా తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినందుకే వైసీపీ రద్దయి పోతుందట. అలా ఎందుకంటే.. పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్‌ అయ్యింది కానీ.. తనకు షోకాజ్ నోటీసు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఇచ్చారట. ఇంకేముంది.. ఈ ఒక్క పాయింట్ చాలు వైసీపీ గుర్తు రద్దయిపోవడానికి అంటూ బెదింపు డైలాగులు కొట్టేస్తున్నారు రాజుగారు.

 

 

విజయసాయి రెడ్డి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం తప్పు అని... దాని వల్ల తన లోక్ సభ సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కాని ఏకంగా వైసిపి రద్దు అయ్యే పరిస్థితి తీసుకు వస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. విజయసాయి రెడ్డి అనాలోచిత నిర్ణయంతో పార్టీకే ముప్పు వాటిల్లేలా ఉందని రాజుగారు సెలవిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిని గానీ, పార్టీని గానీ చిన్న మాట కూడా అనలేదని చెబుతున్నారు.

 

 

రాజ్యాంగంలోని 350, 350 ఏ అధికరణల ప్రకారం మాతృభాషలో విద్యాబోధన జరగాలని, ఈ విషయాన్ని చెప్పినందుకే, తనకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని రఘురామ కృష్ణంరాజు వాదిస్తున్నారు. అయితే రాజుగారి మాటలను పొలిటికల్ కామెడీగా వర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: