గడిచిన నాలుగున్నర నెలలుగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులను తీసుకొస్తున్నాయి. చివరకు శవం ద్వారా కరోనా వ్యాపిస్తుందని నమ్మి కొంతమంది అంత్యక్రియలకు కూడా దూరంగా ఉంటున్నారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం మృతి చెందిన వారికి ఇచ్చే గౌరవం.
చనిపోయిన వారిపై ప్రేమను, అభిమానాన్ని చూపడానికి అంత్యక్రియలు నిర్వహించడమే చివరి అవకాశం. అయితే వైరస్ వల్ల అనుమానిత లక్షణాలతో చనిపోయినవారిని కూడా తాకడానికి భయపడే పరిస్థితి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన మృతదేహాలను అడ్డుకోవడం జరుగుతోంది. అయితే వైద్య నిపుణులు మాత్రం కరోనా మృతదేహాల విషయంలో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కరోనా ప్రధానంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు చిమ్మే తుంపరల ద్వారా వ్యాపించే వైరస్ కాబట్టి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తికి దాదాపు అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సమయం గడిచే కొద్దీ మృతదేహంలో వైరస్ మనుగడ సాగించే శక్తిని క్రమంగా కోల్పోతుందని తెలిపింది.
శవపరీక్ష చేసేటప్పుడు మృతదేహాల ఊపిరితిత్తుల ద్వారా వైద్యులకు, సిబ్బందికి సోకే అవకాశం ఉందని... కరోనా రోగులకు నాన్ ఇన్వేజివ్ పద్ధతిలో అటాప్సీ చేయాలని ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను హైపోక్లోరైట్ ద్రావణంతో డిస్ ఇన్ఫెక్ట్ చేసి అవి బయటకు కనపడకుండా డ్రెస్సింగ్ చేసి ఇస్తారని అందువల్ల మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మార్చురీ బ్యాగ్ జిప్‌ను ముఖం వరకు తీయవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు చివరిసారి చూసి నివాళులు అర్పించవచ్చని... మృతదేహాన్ని మాత్రం తాకరాదని నిపుణులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి