తెలంగాణ యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేక ఏడాది అవుతోంది. సంవత్సర కాలంగా ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు. మూడు వారాల్లో వీసీల నియామకం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చిన కూడు మూడు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
తెలంగాణలో ఒకటి రెండు మినహాయిస్తే యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు.. గతేడాది జులైలో 8 యూనివర్సిటీల వీసీల పదవి కాలం పూర్తయింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా మిగతా యూనివర్సిటీల వీసీల పదవి కాలం ముగిసింది. అప్పటి నుంచి యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించలేదు ప్రభుత్వం. ఐఏఎస్ అధికారులను ఇంఛార్జులుగా నియమించింది. ఒకరిద్దరు ఐఏఎస్‌లకు రెండేసి యూనివర్సిటీల ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది.
అయితే వీసీల నియామకానికి సంబంధించి ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది. నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు తీసుకుంది. పలు యూనివర్సిటీ లకు వీసీల ఎంపిక కోసం సర్చ్ కమిటీలు కూడా వేసింది. ఆ తర్వాత జరగాల్సిన నియామక ప్రక్రియ ఆగిపోయింది. వెంటనే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఫిబ్రవరి నెలలో ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదట యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం చేయాలని కూడా చెప్పారు. మూడు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అయితే ఈసీల నియామకం జరిగింది కాని వీసీల నియామకం ఆగిపోయింది.
కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోవడం, లాక్‌డౌన్ విధించడంతో వీసీల నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. గవర్నర్ కూడా వీసీల నియామకంపై గతంలో సీఎంతో చర్చించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ , సభ్యుల పదవి కాలం పొడగించడంతో యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్స్ నియామకం ఇప్పట్లో ఉండక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అక్టోబర్ వరకు కొత్త వీసీల ఎంపిక ఉండక పోవచ్చని ఉన్నత విద్యా మండలి వర్గాలు అంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి