చైనా పేరుకే వెనకడుగు వేసినట్టు కనిపిస్తూ సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఇండియాకు ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు రావడం ఓ శుభపరిణామంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా శీతాకాలంలో లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తారు. నామమాత్రపు బలగాలను మాత్రమే ఉంచుతారు.
ఎందుకంటే అంత చలిలో ఆ ప్రాంతంలో విధి నిర్వహణ చాలా కష్టం. అయితే చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ శీతాకాలంలో కూడా లద్దాఖ్ లో ప్రస్తుతమున్న బలగాలను అలాగే కొనసాగిస్తారట. లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంట భద్రతపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు సైన్యం ఏర్పాట్లు చేస్తుంది.
ఎంత చలిలో అయినా పని చేసేందుకు వీలుగా సైనికులకు అవసరమైన దుస్తులు, ఇతర సామగ్రిని సైన్యం సమకూర్చనుంది. జూన్ 15న చైనా సైన్యంతో ఘర్షణ తర్వాత లద్దాఖ్ కు భారీగా బలగాలను తరలించిన సైన్యం చైనాతో వివాదం ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కానందున బలగాల కొనసాగింపునకే మొగ్గుచూపుతోంది. ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. పొరుగు దేశం వేస్తున్న వెర్రి మొర్రి వేషాలకు తాము ఏ మాత్రం తగ్గేది లేదని ఇండియా నిరూపించాల్సిన అవసరం ఉంది కదా మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి