ప్ర‌భుత్వాధినేత‌గా జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాల‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవ‌ల కాలంలో తెలుగు మీడియం ఎత్తేయ‌డం, మూడు రాజ‌ధానులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు వేయ‌డం, హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై వైసీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేసినా.. స‌మ‌ర్థించుకుంటున్న తీరు వంటివి జ‌గ‌న్ స‌ర్కారుకు ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర‌స్తాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చేలా చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో తెలియ‌దు కానీ, ఇప్పుడు తాజాగా తీసుకున్న మ‌రో నిర్ణ‌యం మ‌రింత‌గా ఆయ‌న‌ను పాయింట్ అవుట్ చేసేలా ఉంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తున్నాయి.

త‌మ‌ది రైతు ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పుకొంటున్న జ‌గ‌న్‌.. తాజాగా రైతుల‌ను ఇబ్బందిలో పెట్టే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 2014లో జ‌గ‌న్ అదికారంలోకి రాలేక పోవ‌డానికి రైతుల‌కు రుణ‌మాఫీ విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌ని ఇప్ప‌టికీ ప్ర‌చారంలో ఉంది. అందుకే గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు అనేక రూపాల్లో ఆయ‌న హామీల వ‌రద పారించారు.

ఇక‌, ఇప్పుడు మాత్రం రైతుల‌కు కీల‌క‌మైన విద్యుత్ విష‌యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం నిజంగానే మంట‌లు పుట్టిస్తోంది. రైతుల‌కు ఇస్తున్న విద్యుత్‌ను ప‌గ‌టిపూటే.. 9 గంట‌ల‌కు పెంచిన స‌ర్కారు.. రైతుల నుంచి అంతో ఇంతో సానుభూతిని పొందుతున్న మాటవాస్త‌వం. పైగా రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా మ‌రింత‌గా రైతుల‌కు చేరువ‌య్యారు జ‌గ‌న్‌. అయితే, ఇప్పుడు అదే రైతుల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చేలా విద్యుత్ బిల్లుల విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాల‌ను ఇచ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల‌కు వైఎస్ హ‌యాం నుంచి కూడా ఉచిత విద్యుత్ అమ‌ల్లో ఉంది. ఒక్క రూపాయి కూడా క‌ట్ట‌కుండానే రైతులు విద్యుత్ వాడుకుంటున్నారు.

ఈ మొత్తాన్ని ప్ర‌భుత్వ‌మే విద్యుత్ సంస్థ‌ల‌కు చెల్లిస్తోంది. అయితే, ఇప్పుడు.. రైతులు వాడే విద్యుత్‌కు స్మార్ట్ మీట‌ర్లు పెడ‌తామ‌ని సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌లో వెల్ల‌డించారు. అంతేకాదు, రైతులు త‌మ విద్యుత్ బిల్లుల‌ను చెల్లించాల‌ని, త‌ర్వాత ప్ర‌భుత్వం ఆయా బిల్లుల‌కు సంబంధించిన మొత్తాల‌ను రైతుల బ్యాంకు ఖాతాల‌కు జ‌మ చేస్తుంద‌ని అన్నారు. ఇది రైతుల‌కు ఏమేర‌కు మేలు చేస్తుందో తెలియ‌దు కానీ..రాజకీయంగా జ‌గ‌న్‌కు మాత్రం ఇబ్బంది పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యంలో ఏం డెసిష‌న్ తీసుకుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: