ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని.. కొందరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పక్షపాతంతో తీర్పులు చెబుతున్నారని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై పలు వర్గాల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. తాజాగా రిటైర్డ్ న్యాయమూర్తి  జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఛీప్ జస్టిస్ బాబ్డేకి రాసిన లేఖపై విచారణ జరగాలని ఆయన అంటున్నారు. జగన్ లేఖలోని అంశాలపై  నిగ్గుతేల్చాలని ఈ రిటైర్డ్ జడ్జి అంటున్నారు.


చట్టం ముందు అందరూ సమానులేనని చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని  జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. ఏపీ హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలలో కొన్ని సంశయాలు ఏర్పడ్డాయని... ఆ పరిస్థితి మంచిది కాదని జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుందన్నారు. కొందరికి సంబంధించి  స్టేలు 15–16 ఏళ్లపాటు కొనసాగుతుండటంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయని.. వీటిని దూరం చేయడానికి కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.


రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత  హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీఓలపై స్టేలు ఇచ్చిందని... చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులిస్తోందా? అన్న సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా న్యాయస్థానాలు వ్యవహారశైలి ఉండకూడదని  అన్నారు. కేసులు కూడా కొందరు న్యాయమూర్తుల వద్దకే వస్తున్నాయని, వారే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని.. ఇన్ని అనుమానాలు ప్రజల్లో ఎందుకు కలిగించాలని ప్రశ్నించారు.

ఫిర్యాదు వచ్చినప్పడు   విచారించకుండా  వదిలేస్తే వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముందంటున్న ఈ రిటైర్డ్ ... అది అన్నింటికన్నా ప్రమాదమంటున్నారు.. ఫిర్యాదు అందినప్పుడు విచారణ జరిపి నిజానిజాలు తేల్చడం వ్యవస్థకే మంచిదని.. తేల్చిచెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: