వరద బాధితులకు సాయం అందించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో... ప్రముఖులంతా భారీగా స్పందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు... పారిశ్రామికవేత్తలు, సినీ తారలు భారీ విరాళం ప్రకటిస్తున్నారు.

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో... చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తల్లో మేఘా కృష్ణారెడ్డి అత్యధికంగా పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక మై హోమ్‌ రామేశ్వరరావు ఐదు కోట్ల సాయం ప్రకటించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో... ఢిల్లీ ప్రభుత్వం అత్యధికంగా 15 కోట్లు ప్రకటించగా, తమిళనాడు 10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ 2 కోట్లు విరాళం ప్రకటించాయి.

తెలుగు చిత్రసీమ కూడా వరద బాధితులకు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. చిరంజీవి, మహేష్‌బాబు కోటి రూపాయల చొప్పున... నాగార్జున, ఎన్టీఆర్‌ 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. రామ్‌ 25 లక్షలు, విజయ్‌దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 10 లక్షలు, హాసిని అండ్‌ హారికా క్రియేషన్స్‌ యజమానులు 10 లక్షలు విరాళం ప్రకటించారు. డైరెక్టర్లు అనిల్‌రావిపూడి, హరీష్‌ శంకర్‌తో పాటు నిర్మాత బండ్ల గణేష్‌ తలో ఐదు లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ టన్ను బియ్యం, 500 దుప్పట్లను.. స్ఫూర్తి ఫౌండేషన్‌ ద్వారా వరద బాధితులకు అందించింది. సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వగానే స్పందించి సాయం ప్రకటించిన వారందరికీ... మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.

మొత్తానికి వరదలు తెలంగాణ రాష్ట్ర  ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. నిలువ నీడ లేకుండా.. తినడానికి తిండి కూడా లేకుండా చేశాయి. అలంటి అభాగ్యులను ఆదుకోవడానికి ప్రముఖులు మందడుగు వేస్తున్నారు. పెద్ద మనసుతో విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఆపదల్లో తామున్నామని భరోసా ఇస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: