ఖరీఫ్ సీజన్ లో వర్షాధార పంటలు సాగు చేసి దిగుబడి సాధించినటువంటి రైతులు రబీసీజన్ నుండి గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తుంది. రబీపంటకు విద్యుత్ సరఫరా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయానికి 7గంటల పాటు విద్యుత్ సరఫరా చేసే విషయంలో సర్కార్ చేతులెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సాగుచేసే రైతుల పరిస్థితి ప్రశ్నాకర్ధకంగా మారనుంది. రబీ సీజన్ లో వ్యవసాయానికి 7గంటల పాటు కరంటు సరఫరా చేయడం కష్టంగానే ఉందని సంబంధిత విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో రైతులు రబీసీజన్ లో సాగు విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరిపంటను సాగుచేసిన అనంతరం విద్యుత్ సరఫరా కాకపోతే పరిస్థితి ఏమిటనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతాంగం బోర్లపై ఆదారపడి వ్యవసాయం చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో విద్యుత్ కోత విధిస్తే సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా రబీకి సీజన్ కు 7గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలనుకుంటే వాణిజ్యరంగంతోపాటు గృహీవసరాలపై కరంటు కోత ప్రభావం చూపుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తుండడంతో రబీసీజన్ లో వ్యవసాయానికి కరంటు సరఫరా చేయడం అనేది ప్రభుత్వాన్ని సవాల్ గా మారింది. రబీసీజన్ దసరా పండుగ సందర్భంగా ప్రారంభమవుతుంది. వ్యవసాయంపై ఆదారపడి జీవనం సాగిస్తున్నటువంటి పల్లెల్లో దసరా పండుగ సంద్భంగా రైతులు సాగు చేయడం ప్రారంభిస్తారు. అంటే దసరాతో వర్షాకాలం ముగుస్తుంది. దీంతో వర్షాలు పడడానికి అవకాశం ఉండదు కనుక ఆరుతడి పంటలకైనా నీరు అవసరముంటుంది. దీంతో కరంటు కష్టాలు ప్రారంభమవుతాయి. 3వందల ఫీట్లకు పైగా బోర్లు వేసినప్పటికిని చుక్కనీరు రాని పరిస్థితిలో రైతాంగం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులున్నాయి. కాగా మరో వైపు బోర్లలో వచ్చిన కొద్దిపాటి నీటితో 7గంటల పాటు విద్యుత్ సరఫరా అయితే కేవలం 10గుంటలకు నీరు సరిపోతుంది. కాగా విద్యుత్ సరఫరాలో కోత ఉంటే ఆపరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితిలో రబీసీజన్ లో విద్యుత్ కోత ఉంటే తరి పంటలు సాగుచేయడం కష్టంగానే చెప్పవచ్చును. రబీసీజన్ లో వరిపంటలు సాగుచేయరాదని రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడానికి సంబంధిత వ్యవసాయ అధికారులు మరో వారం రోజుల్లో గ్రామాలకు వెళ్తుండవచ్చు గాని ఆరుతడి పంటలు సాగుచేస్తే ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించడం లేదు. బహుశ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం మార్గం ఎప్పుడు చూపిస్తుందో ఎలా చూపిస్తుందో తెలియదుగాని అప్పటి వరకు రైతులు ఆరుతడి పంటలు సాగుచేయడానికి ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆరుతడి పంటలైటువంటి మొక్కజొన్న, వేరుశనగ, జొన్న పంటలను సాగుచేస్తే పంటలు అడవి పందులు నష్టపరుస్తున్నాయి. దీంతో పాటు వేలాదిగా కోతులు గుంపులుగుంపులుగా వచ్చి ఆరుతడి పంటలను నాశనం చేస్తున్నాయి. కాగా ఇటువంటి పరిస్థితి రైతాంగాన్ని వేదిస్తుండడంతో ఇటువంటి పంటలు సాగుచేయడం కోసం రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం రబీసీజన్ లో రైతాంగాన్ని ఆదుకోక పోతే రైతులు మరింత ఆర్థికంగా మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: