మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు డ్వాక్రా మహిళా సంఘాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. తగిన ఆసరా కల్పిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని నిరూపించేందుకు ఎన్నో డ్వాక్రా సంఘాల విజయగాధలు నిరూపిస్తున్నాయి. తగినంత రుణం ఇస్తే.. సొంత వ్యాపారాలతో తమ కాళ్లపై తాము నిలబడుతూ వ్యాపారాభివృద్ధి చేసి చూపిస్తున్నారు మన ఆడపడుచులు. అయితే వారికి ఇప్పటి వరకూ రుణ పరిమితి సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇప్పటి వరకూ ఓ డ్వాక్రా గ్రూపు్‌కు రూ. 10 లక్షల వరకూ మాత్రమే లోన్ ఇస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు  కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.


ఇకపై స్వయం సహాయక సంఘాలకు రూ.20 లక్షల వరకూ రుణం లభించే అవకాశం లభించింది. ఈ మేరకు రుణ పరిమితి పెంచుతూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌బీఐ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డ్రాక్రా  సంఘాల తరఫున మహిళలకు అత్యధికంగా ఇచ్చే రూ.10 లక్షల రుణం మొత్తం ఇకపై పెరగనుంది. కేంద్రం సిఫారసుల మేరకు తాజాగా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను  విడుదల చేసింది. అంతే కాదు.. తమ పొదుపు మొత్తాన్ని అవసరమైనప్పుడు తీసుకునే వెసులుబాటును కూడా ఆర్బీఐ  డ్వాక్రా మహిళలకు ఇప్పుడు  కల్పించింది.


మహిళల పొదుపు ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని  ఆర్‌బీఐ తాజాగా బ్యాంకర్లకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా  దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు రుణాలు పొందుతున్నారు. బ్యాంకులు వీరికి రుణాలు ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 80 లక్షల మందికి పైగా మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో దాదాపు 95% సంఘాలు రుణ వాయిదాలను  సకాలంలో  చెల్లించడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై స్వయం సహాయక సంఘాలకు ఇకపై ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల రుణం ఇవ్వాలి. ఈ రుణాల కోసం  బ్యాంకులు ఎలాంటి ముందస్తు డిపాజిట్లు మహిళలను అడగకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: