గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లకు అత్యాధునిక వైద్య సేవ‌లు అందించే విధంగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా లోని బీబీన‌గ‌ర్ అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ అడుగులు వేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఓపీ సేవ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితమైంది. ఇక ఇందులో దీపావ‌లి పండుగ నుంచి ఇన్‌పేషెంట్ సేవ‌లు కూడ అందుబాటులోకి వ‌చ్చాయి. 100 ప‌డ‌క‌ల ఆసుప్ర‌తిలో జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్స్‌, ఆప్త‌మాల‌జీ, గైన‌కాల‌జీ, ఫ్యామిలీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, డెర్మ‌టాల‌జీతో పాటు 10 ప‌డ‌క‌ల‌తో కోవిడ్ ఐసోలేష‌న్ ఇన్‌పేషెంట్ సేవ‌లు కొన‌సాగుతొన్నాయి.

కేవ‌లం రూ.10 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వారికి దాదాపు సంవ‌త్స‌రం పాటు ఓపీ సేవ‌లు అందిస్తున్నారు. త‌క్కువ ధ‌ర‌కే రోగ నిర్థార‌ణ ప‌రీక్ష‌లైన బ్ల‌డ్‌, ఆల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే వంటివి చేస్తున్నారు. అన్ని ర‌కాల జ‌న‌రిక్ మందుల‌ను కూడ రోగుల‌కు అందుబాటులో ఉంచారు. ప్ర‌స్తుతం డైలీ 400 మంది వ‌ర‌కు ఓపీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏయిమ్స్ ఆసుప్ర‌తిలో 90 మంది వైద్యులు, 128 మంది న‌ర్సులు విధుల్లో చేరారు. మ‌రో 70 మంది డాక్ట‌ర్లు, 100 మంది న‌ర్సుల‌కు సంబంధించిన పోస్టుల‌ను న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే 2019లో 50 సీట్లు, 2020లో 62 వైద్య సీట్లు భ‌ర్తీ చేశారు. అయితే ఈసారి మాత్రం 100 సీట్ల‌ భ‌ర్తీకి శ్రీ‌కారం చుట్టారు. నూత‌నంగా ప్రారంభించిన ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో రెండు శ‌స్త్రచికిత్స‌ల‌ను కూడ విజ‌యవంతంగా పూర్తి చేశారు వైద్యులు. కేంద్ర‌ప్ర‌భుత్వం మంజూరు చేసిన రూ.1028కోట్ల‌లో రూ.800 కోట్ల‌ను నిర్మాణ ప‌నుల‌కు, రూ.183 కోట్లు వైద్య ప‌రికరాలు కొనుగోలుకు.. మిగ‌తా రూ.45 కోట్లు ఆస్ప‌త్రి అభివృద్ధికి కేటాయించార‌ని వెల్ల‌డించారు. 201 ఎక‌రాల‌లో ఉన్న ఈ ఆసుపత్రి భ‌వ‌నాలు , 28 అంత‌స్తుల‌తో మూడు ట‌వ‌ర్లు వైద్య‌క‌ళాశాల‌, ఆయుష్‌భ‌వ‌నం, స్విమ్మింగ్‌పుల్‌, ఆడిటోరియం, వ‌స‌తిగృహాలు, పార్కులు నిర్మించేందుకు ఇప్ప‌టికే ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నులు కొన‌సాగుతుండ‌డంతో గైనిక్‌, పిడియాట్రిక్ వైద్యుల‌ను భువ‌న‌గిరి జిల్లా కేంద్రం ఆసుప‌త్రికి పంపి ప్ర‌స్తుతం అక్క‌డి నుండే వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: