తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29 జ్ఞాపకార్థంగా ఈ సంవత్సరం నవంబర్ 29న వరంగల్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు తెరాస పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే. పార్టీ కి సంబంధించిన  ఈ సభను ప్రభుత్వ పెద్దలు, అధికారులు, మంత్రులు ,శాసనసభ్యులు తమ అధికార దుర్వినియోగంతో నిర్వహణకు పూనుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. పైగా ఇందుకు సంబంధించి వరంగల్ జిల్లాలోని దేవక్కపేట తదితర మూడు నాలుగు గ్రామాల పరిధిలో గల తొమ్మిది వందల ఎకరాల స్థలాన్ని సేకరించడానికి కృషి జరుగుతున్నది. ఇందుకు సంబంధించి పోలీసులు, అధికారులు, శాసనసభ్యులు, మంత్రులు ఆ ప్రాంతాలను సందర్శించి పరిశీలించినప్పుడు అక్కడి రైతులు అడ్డుకోవడం ప్రజల చైతన్యానికి నిదర్శనంగా భావించవచ్చు.

పంట భూములను నిర్దాక్షిణ్యంగా దున్ని చదును చేయడం ఏమిటని..? ఇదేనా రైతు సంరక్షణ అని అనేక మంది రైతులు కూలీలు, కార్మికులు, అధికార,పోలీసులకు ఎదురుతిరిగిన సంఘటన ప్రసార మాధ్యమాలలో రావడం ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది. మా భూములలో బహిరంగ సభను పెట్టుకోవడానికి ప్రభుత్వానికి అనుమతించేది లేదని మా భూములలో బహిరంగ సభ జరిగితే అడ్డుకుంటామని తమ భూములను పంట పొలాలను రక్షించుకుంటమని రైతులు ఆగ్రహంతో వ్యతిరేకించడాన్ని మనం గమనించవచ్చు. సుమారుగా దశాబ్దం క్రితం వరంగల్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెరాస పార్టీ గత రెండు సంవత్సరాల క్రితం హైదరాబాదు పరిసర ప్రాంతాలలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభను మరిచిపోక ముందే అనేక సందర్భాల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ద్వారా తరచు సభలు సమావేశాల వాతావరణమే ఈ రాష్ట్రంలో కనపడుతూ సామాన్యునికి  పరిపాలన రుచి తెలవకుండా పోతున్నది. దానికి తోడు వివిధ సందర్భాలలో వచ్చినటువంటి ఎన్నికలు ,ఉప ఎన్నికలు ప్రభుత్వానికి సవాల్గా మారడంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో ప్రభుత్వo ముందుండి బహిరంగంగా నోట్లను పంచి బజారు పాలు అయినది.  హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో తెరాస పార్టీ తన ప్రభుత్వ విధానాలను చెప్పుకోవడానికి సందర్భోచితంగా జరిగే సభలు సమావేశాలు అవసరమైతే స్టేడియంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి తమ విధానాలను బహిరంగంగా ప్రకటించు కోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: