ఈ సినిమా కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ‘మిర్చి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కొరటాల శివ, ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక శక్తివంతమైన కథను సిద్ధం చేసుకున్నారట. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు, ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను చేయలేనని ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించారట. అనంతరం అదే కథను దర్శకుడు.. రామ్ చరణ్ వద్దకు తీసుకెళ్లారట. కథ నచ్చినప్పటికీ, అప్పటి పరిస్థితులు, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు అవసరమని భావించడం వంటి పలు కారణాల వల్ల చరణ్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇలా ఇద్దరు టాప్ హీరోలు ‘మాకు వద్దు రా బాబోయ్’ అన్నట్టుగా ఈ సినిమాను వదిలేసిన తర్వాత, చివరకు ఈ కథ మహేష్ బాబు దగ్గరకు చేరింది.
మహేష్ బాబుకు కథ వినిపించే ముందు కొరటాల శివ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారట. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, సామాజిక బాధ్యత, వారసత్వ సంపదను సమాజం కోసం వినియోగించుకోవడం వంటి అంశాలను మరింత బలంగా తీర్చిదిద్దారు. కథ వినగానే మహేష్ బాబు వెంటనే ఓకే చెప్పారని సమాచారం. ఆయనకు కథలోని సందేశం, పాత్ర పరిణామం బాగా నచ్చడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సినిమాను చేయడానికి అంగీకరించారట. అలా 2015 ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కథ, సంగీతం, భావోద్వేగాలు, సందేశం – అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటనకు, కొరటాల శివ దర్శకత్వానికి విశేషమైన ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా, సమాజంపై ప్రభావం చూపిన చిత్రంగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ‘శ్రీమంతుడు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటివరకు మహేష్ బాబు కెరీర్‌లో ఉన్న రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తూ, ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాదు, గ్రామాలను దత్తత తీసుకునే ఆలోచనకు ఈ సినిమా ప్రేరణగా మారిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఒక సినిమా, మహేష్ బాబు చేతుల్లో పడి బ్లాక్‌బస్టర్‌గా మారడం టాలీవుడ్‌లో ఇప్పటికీ చెప్పుకునే ఆసక్తికరమైన కథగా నిలిచింది. సరైన హీరో, సరైన టైమింగ్, సరైన విజన్ కలిసొస్తే సినిమా ఏ స్థాయికి వెళ్లగలదో ‘శ్రీమంతుడు’ స్పష్టంగా చూపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి