శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన నాటకీయ పరిణామాలు అనేక మాటల యుద్ధాలకు దారి తీస్తున్నాయి. తన భార్య వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలోనే ఇలాంటి అరాచకపు మాటలు అంటుంటే.. స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారామ్ అడ్డుకోలేదని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్‌లోనే ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మినేని ఎక్కడివాడో కాదు.. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే.. ఆయన నాదగ్గర మంత్రిగా కూడా పని చేశారు.. ఆ విషయం మరిచిపోయి.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా ఆలోచించుకోవాలి అని చంద్రబాబు హితవు పలికారు.


చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా స్పందించారు. తనకు ఆనాడు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావని.. చంద్రబాబు కాదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తర్వాత మళ్లీ రాజకీయంగా పునఃభిక్ష పెట్టింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివరించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తానే రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు శాసనసభలో చెప్పడం సరికాదని ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సభను వాయిదా వేసేముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివరణ ఇచ్చారు.


తమ్మినేని సీతారాం ఏమన్నారంటే.. “‘ నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కానే కాదు. నేను టీడీపీలో చేరేనాటికి చంద్రబాబు అసలు ఆ పార్టీలోనే లేరు. ఆయన అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పటి సీఎం ఎన్టీ రామారావు స్వయంగా  పిలిచి నన్ను పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యేను చేశారు. నేను ఎమ్మెల్యే అయ్యాకనే చంద్రబాబు టీడీపీలో చేరారు... నాకు లాగానే చంద్రబాబుకు కూడా ఎన్టీ రామారావే రాజకీయ భిక్ష పెట్టారు అని తమ్మినేని సీతారాం వివరించారు.


ఆ తర్వాత అనేక విషయాలపై తాను విభేదించి తాను టీడీపీ నుంచి బయటకు వచ్చేశానని తమ్మినేని తెలిపారు. అయితే..  తాను వరుసగా ఎన్నికల్లో ఓడిపోయి 15 ఏళ్లు రాజకీయంగా వెనుకబడిపోయానని.. ఆ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను పిలిపించి పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. జగన్ సూచనల మేరకు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరానని.. ఎన్నికల్లో గెలిచి స్పీకర్‌గా అత్యున్నత స్థానానికి చేరుకున్నానని తెలిపారు. తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది  జగనేనని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: