తెలంగాణ‌లో ముంద‌స్తుగా జ‌రిగిన 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి కేసీఆర్ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నాక‌ ఆ రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా వినిపించిన అభిప్రాయం ఏమిటంటే కేసీఆర్ త‌న త‌న‌యుడు కేటీఆర్‌కు త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అప్ప‌గిస్తారని. అవును అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు కూడా ఇది నిజ‌మేన‌ని భావించారు. కేసీఆర్ పాత సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నాన్ని కూల‌గొట్టించి కొత్త భ‌వ‌నాన్ని నిర్మించేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న తీసుకున్న చ‌ర్య‌లను కూడా ఇందుకు ఆధారంగా చాలామంది చెప్పేవారు. ఆ భ‌వ‌నానికి కేసీఆర్ నిర్ణ‌యానికి లింకేమిటంటే పాత సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నంలో పాల‌నావిధులు నిర్వ‌ర్తించిన ఏ ముఖ్య‌మంత్రి కూడా త‌న వార‌సుడికి ఆ పీఠాన్నిఅందించ‌లేక‌పోయార‌ట‌. కేవ‌లం ఆ కార‌ణంగానే ఆ భ‌వ‌నం నుంచి పాల‌న సాగించ‌డానికి కేసీఆర్ ఇష్ట‌ప‌డ‌లేద‌న్న‌వాద‌న‌లు గ‌ట్టిగానే ఉన్నాయి. ఇక రెండోసారి గెలిచాక రాష్ట్రంలో ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బెట్టి కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసి కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టి పెడ‌తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు కూడా భావించాయి.

          అయితే రాష్ట్రంలో ప‌రిస్థితులు నెమ్మ‌దిగా మారాయి. బీజేపీతో మొద‌ట్లో క‌లిసొచ్చిన నెయ్యం ఆ త‌రువాత క‌య్యంగా మారింది. ఆ పార్టీ ఏకంగా అధికార పీఠానికే గురిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ‌రోప‌క్క కేటీఆర్‌కు భ‌విష్య‌త్తులో అడ్డుకాకూడ‌దనే కార‌ణంతోనే మేన‌ల్లుడు హ‌రీష్‌రావుకు ప్ర‌భుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యం త‌గ్గించార‌న్న విమ‌ర్శ‌లు ఎదురుకాగా, ఉద్య‌మ స‌హ‌చ‌రుడు ఈటెల రాజేంద‌ర్ విష‌యంలో కేసీఆర్ ప్రభుత్వం వ్య‌వ‌హరించిన తీరుతో ఆ విమ‌ర్శ‌లు నిజ‌మేన‌న్న అభిప్రాయాన్నిప్ర‌జ‌ల్లోనూ క‌లిగించాయి. అంతేకాదు.. ఈటెల టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరి ఇప్పుడు కేసీఆర్ మీద ఏకంగా యుద్ధమే ప్ర‌క‌టించారు. మ‌రోప‌క్క‌ కాంగ్రెస్ పార్టీ కూడా క్ర‌మేణా పుంజుకుంటూ టీఆర్ఎస్ కు క్షేత్ర‌స్థాయిలో స‌వాల్ విసురుతోంది. ఇక కేంద్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే  సానుకూల అంశాలు ప్ర‌స్తుతం ఆయ‌న‌కేమీ క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే కేసీఆర్ వ్యూహం మార్చుకున్నార‌ని, ముందు రాష్ట్రంలో పార్టీ బ‌లాన్ని, అధికారాన్ని నిలుపుకోవ‌డం పైనే దృష్టి పెట్టార‌ని.. అందులో భాగంగానే హ‌రీష్‌రావును ద‌గ్గ‌ర‌కు చేర్చుకుని మ‌ళ్లీ ఎన్నిక‌ల టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ సారి తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లున్నా లేకున్నా పార్టీ మ‌ళ్లీ గెలిస్తేనే కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యే ఉంటుంద‌ని ఫిక్స్ అయిపోవ‌చ్చ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: