తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో రెండు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగారు. జనవరి లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని బిజెపి హెచ్చరించింది. అటు కేంద్రం ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని  టిఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బిజెపి నిరుద్యోగ దీక్ష తో తెలంగాణ ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఓవైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే, ఉన్న ఉద్యోగాలను కెసిఆర్ ప్రభుత్వం కూడా ఊడగొడుతోందని మండిపడ్డారు బండి సంజయ్.

 ఏడేళ్లుగా గ్రూప్-1,డీఎస్సీ నోటిఫికేషన్ లు ఇవ్వలేదన్నారు.జనవరి లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. అసెంబ్లీ బయట బీజేపీ శ్రేణులు, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తారన్నారు. అసెంబ్లీ లోపల తమ త్రిబుల్ ఆర్ టీం సభ కార్యక్రమాలను అడ్డుకుంటుదన్నారు. నిరుద్యోగ యువత కోసం తెగించి కొట్లాడుతామన్నారు బండి సంజయ్. అటు కేంద్రంలో బీజేపీ పాలనపై, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న చుగ్, ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకున్నారని మండిపడ్డారు. విపక్షాల ఇళ్ల చుట్టూ పోలీసులను మోహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు బిజెపి దీక్షపై టిఆర్ఎస్ భగ్గుమంటోంది.  కేంద్రం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ, మరోవైపు ఈ దీక్షలేంటని ఎదురుదాడికి దిగింది. తెలంగాణ వచ్చాక తాము ఇచ్చిన ఉద్యోగాల జాబితాను విడుదల చేసిన టిఆర్ఎస్. మోడీ చెప్పిన ఏటా 2 లక్షల కొలువులు ఏవని నిలదీసింది. తెలంగాణలో లక్ష కి పైగా ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎనిమిది లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. ముందు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు  నిరంజన్ రెడ్డి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. చీప్ పబ్లిసిటీ కోసం దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్. కొత్త ఏడాదిలో ఎలాగు నోటిఫికేషన్లు వస్తాయని తెలిసే ఇలా దీక్ష చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బిజెపి ఆరోపిస్తుంటే, కేంద్ర ప్రభుత్వమే నిరుద్యోగులను మోసం చేస్తుందని  టిఆర్ఎస్ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: