రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనడాన్ని నిరోధించేందుకు ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ బ్రేకింగ్ రక్షణ వ్యవస్థనే కవచ్ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్  అన్నారు. లింగంపల్లి, వికారాబాద్ సెక్షన్ లోని గొల్ల గూడా, చిటిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ కవచ్ వ్యవస్థపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దాని పనితీరును ఆయన పరిశీలించారు. ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థను పరిశీలించడానికి లోకో పైలెట్ తో కలిసి ఒక లోకోమోటివ్ లో ప్రయాణించారు. ఇదే సమయంలో అదే ట్రాక్ పై ఎదురుగా మరో లోకోమోటివ్ లో రైల్వే బోర్డు చైర్మన్ ప్రయాణించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. న్యూఢిల్లీ, ముంబై, హౌరా వంటి రద్దీ మార్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కిలోమీటర్ల మేరకు కవచ్ రక్షణ వ్యవస్థను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందుకు అదనంగా 4 వేల నుంచి 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని స్పష్టం చేశారు. కవచ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రతి కిలోమీటరుకు 40 లక్షల నుండి 50 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు.ఆత్మ నిర్బర్

 భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భారతీయ రైల్వేకు సంబంధించి ఇది ప్రధానమైన ముందడుగు అని అన్నారు. భారతీయ రైల్వేకు 4జి స్పెక్ట్రమ్ కేటాయించినట్లు తెలిపారు. భారతీయ రైల్వే భద్రత పెంపులో భాగంగా ప్రపంచ స్థాయి సాంకేతికతతో కవచ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో కవచ్ ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి, వికారాబాద్, సనత్ నగర్, బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిలోమీటర్ల మేర కవచ్ ను అమలు చేసినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: