కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అంటే తెలుగుదేశంపార్టీలో ఉలికిపాటు మొదలైనట్లుంది. బీఆర్ఎస్ విషయంలో తాను మాట్లాడితే బాగుండదని, వివాదం పెరిగిపోతుందని చంద్రబాబునాయుడు భయపడినట్లున్నారు. అందుకనే తాను మాట్లాడకుండా తమ్ముడు అశోక్ బాబుతో మాట్లాడించారు. ఇంతకీ అశోక్ ఏమన్నారంటే రాష్ట్రస్ధాయి పార్టీ టీఆర్ఎస్ ను తమకు తాము జాతీయపార్టీగా మార్చేసుకుంటే సరిపోతుందా ? అంటు ఎద్దేవాచేశారు.





కేసీయార్ ను ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో కానీ ఏపీ విభజనకు కారణమై, దెబ్బకొట్టి, రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కేసీయార్ ను ఏపీలో ఎవరు స్వాగతించరని మండిపడ్డారు. కేసీయార్ కు జాతీయభావం లేదన్న విషయం రాష్ట్ర విభజనతోనే తేలిపోయిందన్నారు. మద్దతుగా వచ్చిన కుమారస్వామి కూడా బీఆర్ఎస్ లో తమ పార్టీని విలీనం చేయనపుడు జాతీయపార్టీగా ఎలా చెప్పుకుంటారని పెద్ద లాజిక్కే లేవదీశారు.





అశోక్ బాబు లాజిక్కులతోనే టీడీపీ ఎంతగా భయపడుతోందో అర్ధమైపోతోంది. ఎలాగంటే టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా ఎలా చెప్పుకుంటారని అశోక్ అడగటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే టీడీపీని కూడా వాళ్ళు జాతీయపార్టీగానే చెప్పుకుంటున్నారు. టీడీపీలో జాతీయ కమిటి, రాష్ట్రకమిటి అని వేర్వేరుగా ఉన్నాయి. టీఆర్ఎస్ జాతీయపార్టీ కానపుడు టీడీపీ మాత్రం జాతీయపార్టీ ఎలాగవుతుంది ? కనీసం కేసీయార్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు లీగల్ ప్రక్రియ మొదలుపెట్టారు. చంద్రబాబు అయితే అదికూడా చేయకుండానే తమది జాతీయపార్టీ అని చెప్పుకుంటున్నారు.





ఇక రాష్ట్రాన్ని విడిగొట్టిన కేసీయార్ లో జాతీయభావన లేదని అశోక్ తేల్చేశారు. మరి రాష్ట్ర విభజన చేయమని చంద్రబాబు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు ఎందుకిచ్చారు ? రాష్ట్ర విభజనకు చంద్రబాబు కూడా కారకుడే కదా. ఆ రోజుల్లో రాష్ట్ర విభజనకు చంద్రబాబు లెటర్లు ఇవ్వకపోతే విభజన జరిగుండేది కాదేమో. విభజనకు మద్దతు తెలిపిన తమ అధినేతను తప్పు పట్టకుండా కేసీయార్ ను అశోక్ ఎలా తప్పుపడతారు. కేసీయార్ చేసింది తప్పయితే చంద్రబాబు చేసింది కూడా తప్పేకదా ? మొత్తంమీద బీఆర్ఎస్ ఏపీలో పోటీచేస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయం టీడీపీలో మొదలైనట్లే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: