ఫిరాయింపులు అనైతికమని, ఫిరాయింపులకు పాల్పడే పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి వార్నింగులు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తమ పార్టీనేతలను చేర్చుకునేందుకు వైసీపీ, టీడీపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపోయారు. తమపార్టీ నుండి నేతలను లాక్కుంటే చూస్తు ఊరుకోమని సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఫిరాయింపలను ప్రోత్సహిస్తున్న పార్టీలకు పుట్టగతులుండవన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ వార్నింగిచ్చింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీవీఎల్, విష్ణు మీడియా సమావేశాల్లో వైసీపీ, టీడీపీలని స్పష్టంగా చెబుతున్నా అందరికీ జనసేన అనే అర్ధమవుతోంది. ఎందుకంటే బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తొందరలో జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి బీజేపీ నేతలను లాక్కునేంత దుస్ధితిలో వైసీపీ, టీడీపీ లేవు. బీజేపీ-జనసేనలు మాత్రమే ఎన్నికలను ఎదుర్కునేట్లయితే రెండుపార్టీలకూ గట్టిఅభ్యర్ధులు దొరకరన్నది వాస్తవం.

అయినా పార్టీ ఫిరాయింపులపై బీజేపీ మాట్లాడటమే ఎబ్బెట్టుగా ఉంది. మధ్యప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్, పాండిచ్చేరి, గోవా లాంటి రాష్ట్రాల్లో యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించింది బీజేపీనే  అన్న విషయం దేశానికంతా తెలుసు. బెంగాల్ ఎన్నికల సమయంలో స్వయంగా నరేంద్రమోడీ మాట్లాడుతు 50 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించటం అప్పట్లో సంచలనమైంది.

మణిపూర్లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఎంఎల్ఏలు ఆరుగురిని తమ పార్టీలో చేర్చుకున్న నీచ చరిత్ర బీజేపీది. ప్రత్యర్ధిపార్టీల ఎంఎల్ఏలను చేర్చుకున్నారంటే అర్ధముంది. కానీ బీజేపీ  మిత్రపక్షం ఎంఎల్ఏలను కూడా వదలటంలేదు. ఈ కారణంగానే బీహార్లో నితీష్ కుమార్ బీజేపీకి దూరమయ్యారు.  ఇలాంటి చరిత్రున్న బీజేపీ ఎంపీ, విష్ణు కూడా ఫిరాయింపులు అపైతికమని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఫిరాయింపుల ద్వారా లాక్కోవాల్సినంత గట్టి నేతలు అసలు బీజేపీలో ఎవరున్నారు ? సో, కమలనాదుల వార్నింగ్ చూస్తుంటే పవన్ కల్యాణ్ కే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: