ఈమధ్య కాలంలో తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్నంత క్యాస్ట్ వార్ గతంలో లేదనే చెప్పాలి. ఒకపుడు క్యాస్ వార్ అంటే ఎక్కడో పైస్ధాయిలో మాత్రమే అది నాలుగు గోడల మధ్య మాత్రమే జరిగింది. అలాంటిది ఇపుడు బహిరంగమైపోయి మామూలు జనాల్లోకి కూడా పాకిపోయింది. ఇలాంటి నేపధ్యంలో ఇపుడు జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వారంటు వినుకొండ బహిరంగసభలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కొత్త మలుపు తిప్పారు.





క్యాస్ట్ వారంటే రెండు కులాల మధ్య ఆధిపత్య పోరన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్యాస్ట్ వార్ ముఖ్యంగా అగ్రకులాల మధ్య అధికారం కోసమే ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటిది ఇపుడు క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని జగన్ చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి ? అసలీ క్లాస్ వార్ ఏమిటి ? క్లాస్ వార్ అంటే ఏమిటంటే పేదలకు-పెత్తందార్లకు మధ్య జరుగుతున్న పోరాటంగా జగన్ అభివర్ణించారు. జగన్ దృష్టిలో పెత్తందార్లంటే కడపునిండిన డబ్బున్నవాళ్ళన్నమాట. మరి పేదలంటే చేయటానికి పని, మూడుపూటల తినడానికి కూడా సరిగా అన్నంలేని వాళ్ళు.





జగన్ దృష్టిలో పెత్తందార్లంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు ఎల్లోమీడియా అనర్ధం. పేదలకు జగన్ తనను తాను ప్రతినిధిగా చెప్పుకున్నారు. పేదల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే పెత్తందార్లయిన చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా తనను అడ్డుకుంటున్నట్లు మండిపోయారు.






అందుకనే అధికారంలోకి పెత్తందార్లు రావాలా ? లేకపోతే తాను రావాలా ? అన్న విషయాన్ని జనాలు తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలను జగన్ తోడేళ్ళగుంపుతో పోల్చటమే కాకుండా తనను తాను సింహంగా చెప్పుకున్నారు. యుద్ధానికి సింహం మాత్రమే సింగిలుగా వస్తుందని తోడేళ్ళే గుంపులుగా వస్తాయన్నారు.  క్యాస్ట్ వార్ అంటే ఎక్కువగా  అగ్రకులాల మధ్య పోరాటం నడుస్తుంటుంది. అదే క్లాస్ వారంటే పెత్తందార్లు-పేదలకు మధ్య జరిగే యుద్ధం. పేదలు అన్నీ కులాల్లోను ఉంటారు. కాబట్టే పేదలను చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు వ్యతిరేకం చేయాలన్నది జగన్ వ్యూహం. మొత్తానికి ప్రతిపక్షాలను పెత్తందార్లుగాను, తోడేళ్ళుగాను జగన్ ముద్రేశారు. మరి జనాలు జగన్ వాదనతో ఏకీభవిస్తారా ? లేక విభేదిస్తారా ?



మరింత సమాచారం తెలుసుకోండి: