మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంటేనే పెద్ద జోక్. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది. అభ్యర్ధులు పోటీకి రెడీ అవుతారు. నియోజకవర్గాల్లో అభ్యర్ధులు చేసే ఖర్చులను పరిశీలించేందుకు అధికారులుంటారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా, రెగ్యులర్ తనిఖీలో పోలీసులు బిజీగా గడిపేస్తారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినట్లు కమీషన్ ప్రకటిస్తుంది. తర్వాత అభ్యర్ధుల్లో ఎవరెవరు ఎంతెంత ఖర్చులు చేసింది లెక్కలతో సహా కమీషన్ కు వివరిస్తారు. దీన్ని కమీషన్ కూడా ఓకే చేసేస్తుంది.

సరిగ్గా ఇక్కడే కమీషన్ బకరా అయిపోతోంది. ఇపుడిదంతా ఎందుకంటే మునుగోడు ఉపఎన్నిక అందరికీ గుర్తుందికదా. దాదాపు రెండునెలలు మునుగోడు ఉపఎన్నికలో జరిగిన ఖర్చుగురించే దేశమంతా మాట్లాడుకున్నది. అసోసియేషన్ ఫర్ డెమక్రసీ రిఫార్మ్స్ (ఏడీఆర్) లెక్కల ప్రకారం ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు చేసిన ఖర్చు సుమారు రు. 650 కోట్లని తేల్చింది. ఏడీఆర్ లెక్కను జనాలు కూడా నమ్మారు. ఎందుకంటే జనాలు తమ కళ్ళారా జరిగిన ఖర్చులను చూశారు కాబట్టి.

అయితే అధికారికంగా అభ్యర్ధులు చేసిన ఖర్చులెంతో తెలుసా ? బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అత్యధికంగా రు. 34.75 లక్షలు. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఖర్చు రు. 26.12 లక్షలు మాత్రమే. అలాగే కాంగ్రెస్ తరపున పోటీచేసిన పాల్వాయి స్రవంత చేసిన ఖర్చు రు. 28.96 లక్షలు. అంటే బీఆర్ఎస్ అభ్యర్ధికన్నా పాల్వయే ఎక్కువ ఖర్చు చేశారట.


మరిదే నిజమైతే రెండునెలలుగా అభ్యర్ధులు పెట్టిన ఖర్చులు ఏమయ్యాయి. మద్యం ఏరులైపారిందన్నారు కదా. పార్టీలు పోటీపడి ఓటుకు రు. 10 వేల దాకా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఓటర్లకు పంచుతున్న డబ్బుల ఫొటోలు కూడా అచ్చయ్యాయి. ఓట్లను టోకున లక్షల రూపాయలిచ్చి కొనేశారన్నారు. వంద ఓట్లు వేయించగలిగిన నేతలకు అభ్యర్ధులు కార్లు బహుమతిగా ఇచ్చారని అబ్బురంగా చెప్పుకున్నారు. మరి ఇవన్నీ నిజాలు కావా. కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ అభ్యర్ధి సుమారు రెండు లక్షలు తక్కువ ఖర్చుపెట్టారంటే ఎవరైనా నమ్ముతారా ? అభ్యర్ధులను దబాయించి మరీ చాలాచోట్ల జనాలు డబ్బులు డిమాండ్ చేసి  తీసుకున్నది నిజంకాదా. అభ్యర్ధులు ఇచ్చిన ఖర్చులను ఆమోదించిన ఎన్నికల కమీషన్ బకరా అయిపోయినట్లు అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: