బందరు బహిరంగసభలో పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి రాజకీయాలు చేయలేక పార్టీని వదిలేసి పారిపోతారని. ఇక్కడే అందరిలోను పవన్ టార్గెట్ చేసింది తన సోదరుడు చిరంజీవి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డినేనా అనే సందేహం పెరిగిపోతోంది. ఎంతోమంది ఏవో కారణాలతో రాజకీయాల్లోకి వస్తారు. ఏదో ఒక పార్టీని రిజిస్టర్ చేసి తర్వాత దాన్ని గాలికొదిలేస్తారు. కానీ పార్టీపెట్టి ఎన్నికల్లో పోటీచేసి తర్వాత రాజకీయాలనుండి తప్పుకున్న ప్రముఖులు మాత్రం చిరంజీవి, కిరణే.





2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టి పోటీచేసిన విషయం తెలిసిందే. 18 శాతం ఓట్లు, 20 సీట్లు తెచ్చుకున్న చిరంజీవి తర్వాత రాజకీయాలు చేయలేక చేతులెత్తేశారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి రాజ్యసభ సభ్యుడై, కేంద్రమంత్రయ్యారు.  తర్వాత ఎంపీ టర్మ్ అయిపోయిన తర్వాత రాజకీయాలను వదిలేశారు. ఇక కిరణ్ అయితే 2014 రాష్ట్రవిభజన సమయంలో సీఎంగా పనిచేశారు.





విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీలోకి దింపారు. అయితే తనతో పాటు ఎవరికీ కనీసం డిపాజిట్లు కూడా తెప్పించలేకపోయారు. ఆ తర్వాత ఆ పార్టీ ఏమైందో ఎవరికీ తెలీదు. తన పార్టీని కిరణ్ గాలికొదిలేసి చివరకు కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.





పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు వీళ్ళిద్దరిని ఉద్దేశించి చేసిందే అని అర్ధమవుతోంది. ఇంతకీ వీళ్ళిద్దరినీ పవన్ ఎందుకు టార్గెట్ చేశారంటే వాళ్ళలాగ తాను పార్టీపెట్టి మధ్యలోనే పారిపోలేదని చెప్పుకోవటానికే. పదేళ్ళ క్రితం జనసేనను ఏర్పాటుచేసి ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు. పదేళ్ళల్లో తాను చేసిన పోరాటాలు ఏమిటి ? ఎవరిపైన పోరాడారు ? అన్న విషయాన్ని పవనే చెప్పాలి. పదేళ్ళుగా పవన్ టార్గెట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అని అందరికీ తెలుసు. దీన్నే పవన్ పోరాటమని అనుకుంటున్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: