సూపర్..విచారణంటే ఇలాగే జరగాలి. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు కానీ మనిషే కుక్కను కరిస్తే అదే వార్తని ఒక నానుడుంది. ఇపుడు ఢిల్లీలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆపీసులో  వ్యవహారం అచ్చంగా ఇలాగే రివర్సులో జరుగుతోందట. మంగళవారం విచారణ ఎలా సాగుతోందో తెలీదు కానీ సోమవారం విచారణ మొత్తం సూపర్ గా జరిగిందని బీఆర్ఎస్ మీడియా ఊదరగొట్టేసింది. ఈడీ విచారణకు హాజరవ్వటానికే కల్వకుంట్ల కవిత భయపడింది వాస్తవం.





విచారణకు హాజరైతే తనను ఈడీ అరెస్టు చేస్తుందోమే అనే భయంతోనే 16వ తేదీ విచారణకు గైర్హాజరయ్యారు. అయితే జరగబోయే పర్యవసానాలను లాయర్లు వివరించిన తర్వాతే కవిత 20వ తేదీ విచారణకు హాజరయ్యారని ప్రచారం జరిగింది. అయితే 21వ తేదీన బీఆర్ఎస్ మీడియా మాత్రం రివర్సులో కథనాలను అచ్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే విచారణకు కూర్చున్న కవితను అధికారులు విచారించలేదట. కవితే ఈడీ ఉన్నతాధికారులను విచారించారట.





మచ్చుకి కొన్ని ప్రశ్నలు ఏమిటంటే  తనను నిందితురాలిగా విచారిస్తున్నారా ? లేకపోతే అనుమానితురాలిగా విచారిస్తున్నారా ? అని అడిగారట. అనుమానితురాలిగా అని ఈడీ సమాధానమిచ్చిందట. అయితే ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా లిక్కర్ పాలసీని మార్చుకుంటే దాంతో తనకేమిటి సంబంధం ? అని అధికారులను కవిత నిలదీశారట. రాజకీయ కక్షలతో మీరు ఎంతమందిని విచారణకు పిలిచి వేధిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారట.





హిమంత బిశ్వశర్మ, సుజనాచౌదరి, నారాయణ రాణే తదితరులపై ఈడీ పెట్టిన కేసులు ఏమయ్యాయి ? వాళ్ళంతా బీజేపీలో చేరగానే ఆ వాళ్ళపై విచారణ ఎందుకు ఆగిపోయిందని గట్టిగా తలంటుపోశారట. విచారణ పేరుతో పిలిచి ఒంటరిగా గదిలో కూర్చోబెడితే మానసికంగా లొంగిపోయి ఈడీకి లొంగిపోతానని అనుకుంటున్నారా అంటూ గయ్య్ మన్నారట. విచారణలో పారదర్శకత, నిజాయితి ఎందుకు లేదని ఉతికి ఆరేశారట. మొత్తంమీద ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కవితను ఎందుకురా విచారణకు పిలిచామని అధికారులు తలలు పట్టుకున్నారన్నట్లుగా మీడియా రాసుకొచ్చింది. మరి ఇది నిజమేనా ?  


మరింత సమాచారం తెలుసుకోండి: