తెలంగాణా కమ్యూనిస్టు పార్టీల నేతలు తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల గురించి సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ఇంకా ఒక క్లారిటీకి రాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని మాత్రమే చెప్పారు. వీళ్ళ మాటలు ఎలాగున్నాయంటే వామపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్ వెంపర్లాడుతున్నట్లుగా ఉంది. వామపక్షాల సహకారం లేకపోతే వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం కష్టమని చెప్పి కమ్యూనిస్టుల చుట్టు పొత్తుకు ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా ఉంది.

నిజానికి పొత్తుకోసం కమ్యూనిస్టు పార్టీలే కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకపుడు తమకు పొత్తుంటే బీఆర్ఎస్ తో మాత్రమే ఉంటుందని, కాంగ్రెస్ తో ఉండదని ఇదే వామపక్షాలు తెగేసిచెప్పాయి. అయితే కమ్యూనిస్టు పార్టీలను కేసీయార్ తీసి అవతల పారేశారు. వీళ్ళతో పొత్తుకు కేసీయార్ ఏమాత్రం ఆసక్తిచూపలేదు. పొత్తు కాదుకదా చివరకు మాట్లాడేందుకు అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో కమ్యూనిస్టులకు బాగా అవమానం అయ్యింది.

అందుకనే ఇపుడు కేసీయార్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే తమ టార్గెట్ అంటు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవాలని ఇపుడు అనుకుంటున్నారు. నిజానికి కమ్యూనిస్టులకు ఒకప్పటి వైభవం ఇపుడు లేదనే చెప్పాలి. ఒకపుడు కమ్యూనిస్టుపార్టీలంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నాయకత్వం ఉండేది. అలాంటిది స్వయంకృతం వల్ల మెల్లిగా కుచించుకుపోయి చివరకు రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయింది.

ఒకపుడు రాష్ట్రమంతా ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టులు ఇఫుడు నల్గొండ, ఖమ్మంకు మాత్రమే పరిమితమైపోయారు. అదికూడా రెండు జిల్లాల్లోని నాలుగు ఐడు నియోజకవర్గాలకు మాత్రమే ప్రభావం చూపేస్ధాయికి దిగిపోయారు. వాస్తవాన్ని అంగీకరించకుండా తాము ఇంకా అత్యంత బలంగా ఉన్నామని కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీలకు చెరో అసెంబ్లీ సీటును కేటాయిస్తే అదే చాలా ఎక్కువన్నట్లుగా ఉంది. కానీ వామపక్షాలేమో చెరో మూడుసీట్లు అడుగుతున్నాయి. సమస్యంతా ఇక్కడే వస్తున్నది. మరి చివరకు ఏ విధంగా సమస్య సెటిల్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: