ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో  పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధులందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. టీడీపీ కూటమి తరపున పోటీచేయబోయే స్ధానాలు సర్దుబాటు చేసుకున్నాయి. కూటమిలోని టీడీపీ తరపున పోటీచేయబోతున్న 144 సీట్లలో  128 మంది అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ప్రకటించేశారు. జనసేన పోటీచేయబోతున్న 21 సీట్లలో 7గరు అభ్యర్ధులను ప్రకటించారు. బీజేపీ పోటీచేస్తున్న పది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించలేదు. పెండింగులో ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ కసరత్తులు చేస్తున్నారు.





అంటే ప్రధాన పార్టీలు వైసీపీ పూర్తిగాను, టీడీపీ దాదాపు అభ్యర్ధులను ప్రకటించేసినట్లే. మరి మిగిలిన కాంగ్రెస్ కూటమి మాటేమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు. అభ్యర్ధుల ఎంపికకు పార్టీ చీఫ్ షర్మిల దరఖాస్తులను తీసుకున్నారు, ఇంటర్వ్యూలను కూడా పూర్తిచేశారు. ఇది జరిగి 15 రోజులుదాటినా ఇప్పటివరకు ఒక్కరంటే అభ్యర్ధిని కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీయే అభ్యర్ధులను ప్రకటించలేదు కాబట్టి పొత్తులోని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎవరినీ ప్రకటించలేదు. నిజానికి కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ అభ్యర్ధులపై జనాల్లో పెద్దగా అంచనాలు ఏమీలేవనే చెప్పాలి.





అయినాసరే కొద్దిరోజులుగా షర్మిల చేస్తున్న హడావుడి కారణంగానే కాంగ్రెస్ అభ్యర్ధులపై జనాల్లో కొంత ఆసక్తి మొదలైంది. ఇపుడు విషయం ఏమిటంటే పోటీచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు తీసుకున్న షర్మిల తాను ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. కడప పార్లమెంటుకు పోటీచేయాలని రాహుల్ గాంధి ఆదేశించినట్లు ప్రచారంజరుగుతోంది.  24 గంటలూ జగన్మోహన్ రెడ్డిపైన పదేపదే ఆరోపణలు చేస్తున్న షర్మిల పులివెందుల నుండి పోటీచేస్తేనే బాగుంటుంది. ఏదో గట్టుతగాదాల కారణంగా  జగన్-షర్మిల మధ్య విభేదాలు మొదలై బాగా పెరిగిపోయాయని అర్ధమవుతోంది.





కాబట్టి జగన్ కు తన కెపాసిటీని చూపించాలంటే కచ్చితంగా పులివెందుల అసెంబ్లీకి షర్మిల పోటీచేయాల్సిందే. పులివెందులలో కాకుండా ఇంకే నియోజకవర్గంలో షర్మిల  పోటీచేసినా ఉపయోగముండదు. గ్రౌండ్ లెవల్ రిపోర్టును గమనిస్తుంటే అసలు షర్మిల పోటీచేస్తారా అనే సందేహం కూడా పెరిగిపోతోంది. పార్టీ అభ్యర్ధులకు ప్రచారం చేయాలి అనే పేరుతో షర్మిల పోటీకి దూరంగా ఉంటారా అనే అనుమానులు పెరిగిపోతున్నాయి. ఇదే జరిగితే షర్మిల నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయిపోవటం ఖాయం. మరి తన నిర్ణయాన్ని షర్మిల ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: