ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. కూటమి వర్సస్ అధికార వైసీపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎట్టకేలకు చివరి లిస్టులో సీటు దక్కింది. ఇక భీమిలి సీటును గంటా దక్కించుకున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అయిన అవంతి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకప్పటి మంచి మిత్రులు. ఒక విధంగా వీరు గురు శిష్యులు. ఇప్పుడు వీరు రాజకీయ ప్రత్యర్ధులుగా ఒకటే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. విశాఖ జిల్లాలో భీమిలి సీటుకు ఒక ప్రత్యేకత ఉంది. 2009 వ సంవత్సరంలో ఇద్దరూ ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. 2009లో భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ ఇంకా అనకాపల్లి నుంచి గంటా ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. ఆ తరువాత గంటా నాడు కిరణ్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. చిరంజీవితో మంచి రిలేషన్ ఉన్న నేత కావటంతో మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తరువాత గంటా, అవంతి ఇద్దరూ కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఇష్టం లేకుండా అవంతి అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది. భీమిలి స్థానంని గంటా తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గంటా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.అప్పటి నుంచే గంటాతో అవంతికి దూరం ఏర్పడింది.ఇక భీమిలి నుంచి గంటా పోటీ చేసేందుకే తనను ఎంపీగా పంపారనేది అవంతి అభిప్రాయం.గంటా టీడీపీలో ఉండగానే..అవంతి వైసీపీలో చేరారు.


 భీమిలి నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో గెలిచారు. తాను కోరుకున్న విధంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. గంటా టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, టీడీపీ వ్యవహారాల్లో మాత్రం అంటీ మట్టనట్లుగానే వ్యవహరించారు. గంటా వైసీపీలో వస్తున్నారనే ప్రచారంతో అవంతి బాగా అలర్ట్ అయ్యారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. దీనికి గంటా ఒప్పుకోకపోవడంతో చివరి నిమిషంలో గంటాకు భీమిలి సీటు ప్రకటించారు.భీమిలి నుంచి రెండు సార్లు అవంతి, ఒకసారి గంటా విజయం సాధించారు. ఇద్దరూ కూడా ఒకటే సామాజిక వర్గం. భీమిలిలో కాపు వర్గంతో పాటుగా యాదవులు ఇంకా బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సారి జనసేన పార్టీతో పొత్తు కారణంగా తనకు కలిసి వస్తుందని గంటా భావిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి గెలవడంతో అప్పటి నుంచి ఉన్న పరిచయాలు, వైసీపీకి సహజంగా ఉండే ఓట్ బ్యాంక్ తో తనకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది అవంతి అంచనా. కోరి మరీ తెచ్చుకున్న సీటు కావటంతో ఇక్కడ గెలుపు గంటాకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గంటా పైన గెలిచి తన సత్త చాటాలనేది అవంతి లక్ష్యం. ప్రస్తుతం వీరిద్దరి మధ్య భీమిలి కేంద్రంగా సాగే ఎన్నికల యుద్దం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: