ప్రస్తుత కాలంలో సినిమాల్లో రాజకీయాల్లో వారసత్వం అనేది కొనసాగుతోంది.  కానీ కర్ణాటకలో ఉండే ఈ ప్రాంతంలో మాత్రం గత మూడు తరాల నుంచి ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే రాజకీయ వారసులుగా కొనసాగుతున్నారు.  అప్పుడు తాతలు చక్రం తిప్పితే, ఇప్పుడు మనవాళ్లు చక్రం తిప్పడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటయ్యా అంటే..  కర్ణాటకలోని ఒకప్పటి హయాసాల సామ్రాజ్య రాజధాని హసన్. ఈ నియోజకవర్గం పేరు చెబితే  అందరికీ గుర్తుకు వచ్చేది దేవెగౌడ. ఈయన దేశానికి ప్రధానిగా కూడా చేశారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి తన మనవడు ప్రజ్వాల్ రేవన్న ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

 ఈయన బిజెపి,జెడిఎస్ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.  ఈయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రేయస్ ఎం పటేల్  పోటీలో ఉన్నారు. ఈయన కర్ణాటక మాజీ మంత్రి దివంగత జి పుట్ట స్వామి గౌడ మనవడు. అప్పట్లో ఇదే నియోజకవర్గం నుంచి దేవెగౌడ, పుట్ట స్వామీలు పోటా పోటీలో బరిలోకి దిగారు. ఇందులో ఎక్కువసార్లు దేవెగౌడ  పై చేయి సాధించారు. ప్రస్తుతం తాతల తర్వాత మనవాళ్ళు  ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. హసన్ లోక్ సభ స్థానం నుంచి దేవెగౌడ 5 సార్లు విజయం సాధించారు.

  2019 ఎన్నికల సమయంలో మనవడి కోసం ఆయన ఈ సీటు త్యాగం చేశాడు. అప్పటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జెడిఎస్ కూటమిగా ఏర్పడి   ప్రజ్వాల్ ను  భారీ మెజారిటీతో గెలిపించారు.  జెడిఎస్ తరపున ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక ఎంపీగా ఆయన పేరు తెచ్చుకున్నారు.  ఆ తర్వాత కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో జెడిఎస్, బిజెపి జతకట్టిన విషయం అందరికీ తెలుసు.  ఈ సందర్భంలోనే తాజాగా కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ మరోసారి బరిలో ఉన్నారు. ఇదే క్రమంలో ప్రజ్వల్ పై  స్థానికంగా కాస్త వ్యతిరేకత ఉందట.  

ఆయన కొన్ని అక్రమాల్లో ఇరుక్కోవడంతో పాటుగా బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం జేడిఎస్ లో కొంతమంది నాయకులకు నచ్చలేదు. దీనివల్ల ప్రజ్వాల్ పై కాస్త వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ హసన్ ప్రాంతంలో శ్రేయాస్ పటేల్ కు సంబంధించినటువంటి  సామాజిక వర్గం ఎక్కువగా ఓట్లు ఉండడంతో అది కూడా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో శ్రేయస్ 1999 నాటి తన తాత విజయాన్ని మళ్లీ తీసుకొస్తానని దీమాతో ఉన్నారు. తాతల తరం తర్వాత మనవాళ్ళ పోరు జరుగుతున్న ఈ తరుణంలో కర్ణాటకలోని ప్రతి ఒక్కరి చూపు హసన్ ప్రాంతంపై పడింది. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: