మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ లోని ఉమ్మడి ఘట్కేసర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్లు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయించలేకపోయారని మండిపడ్డారు. అక్రమ ఆస్తులు, భూములు కాపాడుకోవడం కోసమే మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈటలకు ఎంతో అవకాశం ఇచ్చి, తన సొంత మనిషిల చూసుకున్నాడని అన్నారు. అయినప్పటికీ కేసిఆర్ ని మోసం చేశారని.. అలాగే హుజురాబాద్, గజ్వేల్ ప్రజలను కూడా మోసం చేశారని ఫైర్ అయ్యారు. 20 సంవత్సరాలు హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏమి చేయలేదన్నారు. అందుకే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓడిపోయారని విమర్శించారు. పదవి లేకుండా ఉండలేకనే మరోసారి మల్కాజ్‌గిరిలో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని వెల్లడించారు.

హుజురాబాద్ లో ఎన్నడు కనీసం దేవుడి బొట్టు కూడా పెట్టుకుని ఈటల ఇప్పుడు దేవుడి గుడి కట్టాలంటూ మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. ఈటల రాజేందర్ ప్రజలను మోసం చేయడానికే తప్ప, ప్రజలకు సేవ చేయడానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి మల్కాజ్‌గిరిలో ఎలా చెల్లుతుందని.. ప్రజలు ఆలోచన చేయాలని ఎమ్మెల్యే పైడి కౌశిక్ చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకోవాలని తెలిపారు. మల్కాజ్‌గిరి సమస్యల కోసం బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మారెడ్డి పార్లమెంట్ లో మాట్లాడతారన్నారు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: